మోహన్ భగవత్ వ్యాఖ్యలపై దుమారం
- ముగ్గురు పిల్లల్ని కనండన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
- రాజకీయ దుమారం రేపుతున్న వ్యాఖ్యలు
- భగవత్ వ్యాఖ్యలను తప్పుబడుతున్న విశ్లేషకులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పిల్లల గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా రగడకు కారణం అయ్యాయి. ఏఐఎంఐఎం వంటి అనేక పార్టీలు భగవత్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నాయి. అంతే కాకుండా అనేక మంది మహిళా నేతలు కూడా భగవత్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్ 1న నాగ్‌పూర్‌లో జరిగిన ఓ సమావేశంలో భగవత్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ కనీసం ముగ్గురు పిల్లలను కనాలని సూచించారు. ‘పలు అధ్యయనాలు జననాల రేటు తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది అంత మంచిది కాదు. ఈ భయాల నుంచి వెంటనే బయటపడాలి. అందుకోసం ఎక్కువ మంది సంతానాన్ని కనాలి. జనాభా తగ్గుదల వల్ల అనేక జాతులు, భాషలు అంతరించాయి’ అని భగవత్ వ్యాఖ్యానించారు.
జనాభా తగ్గుదల శాపం
జనాభా తగ్గుదల అనేది ఒక శాపం అని భగవత్ పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో భారతదేశ సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతున్న క్రమంలో అధిక సంతానాన్ని కనడం ఒక్కటే సమస్యకు పరిష్కారం అని భగవత్ పేర్కొన్నారు. కాగా.. భగవత్ వ్యాఖ్యలపై అనేక మంది విశ్లేషకులు కూడా ఫైర్ అవుతున్నారు.
రాజకీయ రగడ..
భగవత్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. దేశంలో ఉన్న అనేక పార్టీల మహిళా నేతలతో పాటు వివిధ పార్టీల అధినేతలు కూడా భగవత్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. స్త్రీలు ఏమైనా కుందేళ్లా ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి అని కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి ప్రశ్నించారు.






