16 April, 2026 | 2:23 AM

వడదెబ్బ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన

16-04-2026 12:44 AM

ప్రజలు ఎండల తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి

గరిడేపల్లి, ఏప్రిల్ 15 : వడదెబ్బపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల వైద్యాధికారి డాక్టర్ వి నరేష్ గురువారం ప్రజలకు అవగాహన కల్పించారు.వడదెబ్బ లక్షణాలు,శరీర ఉష్ణోగ్రత ఎక్కువ అవ్వడం,తలనొప్పి ,తల తిరగడం వాంతులు,అధిక చెమటలు లేదా చెమటలు లేకపోవడం ఈ లక్షణాలు ఉంటాయన్నారు. ఈలక్షణాలు ఉన్నట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావాలని సూచించారు.నివారణ చర్యలుగా ఎక్కువగా నీరు తాగాలన్నారు.మరియు నిమ్మరసం,మజ్జిగ త్రాగాలన్నారు.

మధ్యాహ్నం 12 గంటల నుండి నాలుగు గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది అన్నారు.ముఖ్యంగా ప్రస్తుతం ఎండలు తీవ్రతరంగా ఉన్న  దృష్ట్యా బయటి పనులను ఉదయం 12గంటల లోపు ముగించుకోవాలన్నారు అదేవిధంగా సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే బయటకు వెళ్లాలన్నారు. బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా గొడుగు టోపీ లేదా చేతి రూమాలను తలపై ఉంచుకోవాలన్నారు. పలుచని కాటన్ దుస్తులను ధరించాలన్నారు. గ్రామాలలో ఆశా కార్యకర్తల వద్ద ఓఆర్‌ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రజలందరూ ఎండలు తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.