పోలీసులకు ప్రజా దర్బార్
నిర్మల్,(విజయక్రాంతి): పోలీస్ శాఖలో పనిచేస్తున్న వివిధ ఉద్యోగుల సమస్యలను తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల శనివారం పోలీస్ దర్బార్ నిర్వహించారు. ఎస్పీ కార్యాలయంలో పోలీసు ఉద్యోగులతో వారి సమస్యలు కుటుంబ సమస్యలు ఇతర సమస్యలను అడిగారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హోంగార్డులకు, ఏ.ఆర్ కానిస్టేబుల్లతో ముఖాముఖి సమావేశమై వారి విధి నిర్వహణకు సంబంధించిన సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
సిబ్బంది తమకు ఎదురవుతున్న వివిధ సమస్యలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకురాగా, వాటిని సానుభూతితో విన్న ఎస్పీ సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలీసు ఉద్యోగి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టింగులు,మద్యం, మాదకద్రవ్యాలు వంటి చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని సూచించారు. ఎలాంటి వ్యక్తిగత లేదా విధి నిర్వహణ పరమైన ఒత్తిళ్లు పడవద్దని తమ దృష్టికి తేవాలని సూచించారు.






