5 June, 2026 | 12:54 AM

మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కీలకం

05-06-2026 12:00 AM

ఎస్పీ మహేష్ బి. గితే

తంగళ్ళపల్లి, జూన్ 4 (విజయక్రాంతి): సురక్షితమైన, శాంతియుతమైన సమాజ నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా తంగాళ్ళపల్లి మండలం తాడూరు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. మైనర్ల వాహన చోదనపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.గ్రామాల్లో ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ కమిటీలు బ్లాక్ స్పాట్లను గుర్తించి, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా భద్రతకు సంబంధించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. మహిళలు, యువతులు, విద్యార్థినులు షీ టీమ్ సేవలను వినియోగించుకోవాలని సూచిస్తూ, వేధింపులు లేదా ఇతర సమస్యలు ఎదురైనప్పుడు షీ టీమ్ హెల్ప్లైన్ 87126 56425ను సంప్రదించాలని తెలిపారు.

భరోసా కేంద్రం ద్వారా న్యాయ, వైద్య, మానసిక కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్న ఎస్పీ, వాటి నిర్మూలన కోసం ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ ఉపేందర్ చారి, వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.