ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్..
ములుగు (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.(District Collector Divakara T.S.) సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి లతో కలిసి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణి ఆశ్రయిస్తున్నారని, వారి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని, ప్రజావాణి పోర్టల్ లోని పెండింగ్ దరఖాస్తులను కూడా పరిష్కరించాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో 56 దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలు 23, గృహ నిర్మాణ శాఖకు 15, ఉపాధి కల్పనకు 01,పెన్షన్ 02, ఇతర శాఖలకు సంబంధించినవి 15 దరఖాస్తులను స్వీకరించగా వాటిని పరిశీలించిన అనంతరం సమావేశ మందిరంలోనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు.






