ప్రజాసంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, డిసెంబరు 28 (విజయ క్రాంతి): సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, చొప్పదండి నియోజకవర్గం లోని ప్రతి పల్లెను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర మండలం మంగపేట గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్ లింగాల లింగయ్య, ఉపసర్పంచ్ నల్ల హన్మంతు, వార్డు మెంబర్లు ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గంగాధర ప్రజా కార్యాలయంలో ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు.
చొప్పదని నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, తోట సంధ్య, కరీం, మ్యాక వినోద్, తదితరులు పాల్గొన్నారు.




