7 April, 2026 | 3:11 AM

ప్రజా సంక్షేమమే ధ్యేయం

07-04-2026 12:30 AM

రూ. 4.25 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కశిరెడ్డి శ్రీకారం!

తలకొండపల్లి, ఏప్రిల్ 6(విజయక్రాంతి) :నియోజకవర్గ అభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి సోమవారం తలకొండపల్లి లో విస్తృత పర్యటనలు నిర్వహించారు. సంక్షేమ పథకాల పంపిణీ నుంచి ఆలయాల అభివృద్ధి వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొని నియోజకవర్గ ప్రజల్లో భరోసా నింపారు. సోమవారం ఉదయం తన నివాసంలో వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి  చెక్కులను మరియు ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు. ఆపద కాలంలో ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

అనంతరం తలకొండపల్లి మండలం పడకల్ గ్రామ పంచాయతీలో రూ.10 లక్షల రూపాయలతో మంజూరైన ’మహిళా సమాఖ్య భవనానికి’ శంకుస్థాపన చేశారు.  గ్రామంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ప్రారంభించి, వైద్య సేవలను పర్యవేక్షించారు. పడకల్ గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం రూ. 1.25 కోట్ల భారీ నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వెలిజాల గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన ఇంద్రమ్మ ఇళ్లను ప్రారంభించి, పేదవాడి సొంతింటి కల సాకారం కావడం సంతోషకరమని పేర్కొన్నారు.

వేలాద్రి ఆలయ అభివృద్ధికి రూ. 3 కోట్లు..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేలాద్రి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం మంజూరైన రూ.3 కోట్ల రూపాయల పత్రాన్ని ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాసమూర్తి గారికి అందజేశారు. ఆధ్యాత్మిక కేంద్రంగా వేలాద్రిని తీర్చిదిద్దుతామని వెల్లడించారు. పర్యటనలో భాగంగా మాదాయిపల్లి, చౌదరిపల్లి మరియు వెలిజాల గ్రామాల్లోని లబ్ధిదారులకు నేరుగా చెక్కులను అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రతి రూపాయి అర్హుడైన లబ్ధిదారునికి చేరడమే మా ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే  కొసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర యాత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాలకూర్ల రవికాంత్‌గౌడ్, మాజీ ఎంపీపీ రఘురాములు, మండల పార్టీ అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి, వివిధ మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.