తీగ లాగితే కదిలిన అవినీతి డొంక
- బడంగ్‌పేట్ మున్సిపాలిటీలో దోపిడీ పర్వం
- వందల కోట్ల అంచనాలతో పక్కా స్కెచ్
- ఏసీబీ విచారణలో విస్తుపోయే నిజాలు
- కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ, విజిలెన్స్ అధికారులు విచారణ
- అక్రమార్కుల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు
రంగారెడ్డి, మార్చి 20 (విజయక్రాంతి): శివారు మున్సిపాలిటీల విలీనం కొందరు అధికారులకు, మాజీ ప్రజాప్రతినిధులకు అక్షయపాత్రలా మారింది. మహేశ్వరం నియోజకవర్గం లో ని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి భాగోతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ‘తీగ లాగితే డొంక కదిలినట్లు‘ ఒక చిన్న ఫిర్యాదుతో మొదలైన విచారణ.. ఏకంగా రూ. 122 కోట్ల టెండర్ల కుంభకోణాన్ని బయటపెట్టింది. గత పాలక వర్గం, ప్రభుత్వ అండదండలతో సాగిన ఈ ’నిర్మాణ’ విన్యాసాలపై ఇప్పుడు ఏసీబీ పంజా విసిరింది.
పని చేయలేదు.. కానీ బిల్లులు మాత్రం పక్కా..
బడంగ్పేట కార్పొరేషన్లో అవినీతి ఏ స్థాయిలో జరిగిందంటే.. అధికారులు ఏకంగా 2,000కు పైగా పనులను ప్రతిపాదించారు. ఇందులో విస్తుపోయే అంశాలు ఏంటంటే...నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాల్సిన కోట్లాది రూపాయల పనులను, చిన్న చిన్న ముక్కలుగా విభజించి తమ అనుచరులకు ’నామినేషన్’ పద్ధతిలో కట్టబెట్టారు. ఒకే పనికి రెండు, మూడు సార్లు బిల్లులు డ్రా చేయడం.
క్షేత్రస్థాయిలో అస్సలు జరగని పనులకు కూడా రికార్డుల్లో పూర్తయినట్లు చూపించి నిధులు స్వాహా చేశారు నిషేధిత భూముల్లో (22ఏ) లో అనుమతులు భూములతో పాటు, సుమారు 1,600 ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దీంతో పక్క సమాచారం తో విజిలెన్స్ రంగంలోకి దిగింది.
కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..
ఈ నెల 12 న ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో మొదలైన విచారణ గత నాలుగు రోజులుగా కొన సాగుతుంది. గ్రామ పంచాయతీ నుంచి మొదలు కొని, మున్సిపాలిటీ, కార్పొరేషన్ హయాంలో సాగిన పనులు, బడ్జెట్ కేటాయింపులు, మార్పులు, చేర్పులు చేసిన ప్రతి రికార్థులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 మంది సభ్యుల బృందం బడంగ్పేట కార్యాలయాన్ని జల్లెడ పట్టింది.
గతంలో విజిలెన్స్ విభాగం ఈ ఫైళ్లను ఎందుకు పక్కన పెట్టిందో ఏసీబీ ఆరా తీస్తోంది. రాజకీయ ఒత్తిళ్లతో విజిలెన్స్ అధికారులు మిన్నకుండిపోయారనే ఆరోపణల నేపథ్యంలో, ఏసీబీ ఇప్పుడు టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.ముఖ్యంగా, 49 అక్రమ నిర్మాణాలను గుర్తించినా నోటీసులు ఇవ్వకపోవడం వెనుక ఎంత మొత్తం చేతులు మారిందనే కోణంలో విచారణ సాగుతోంది.
నిబంధనల ప్రకారం సక్రమంగా దరఖాస్తు చేసుకున్న వారికి 21 రోజుల్లో అనుమతులు ఇవ్వకుండా వేధించడం, మరోవైపు అక్రమార్కులకు వెనకాముందూ చూడకుండా పర్మిషన్లు ఇవ్వడం అధికారుల అవినీతితనాన్ని ఎత్తిచూపుతోంది.
రాజకీయ అండతో ఎదురుదాడి..
ఇంత జరుగుతున్నా అక్రమార్కుల్లో భయం లేదు సరికదా.. గతంలో బడంగ్ పేట్ కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాల పై వార్తలు ప్రసారం చేసిన మీడియాపై, ఫిర్యాదుదారులపై ఎదురుదాడికి దిగడం గమనార్హం. ‘మా వెనుక పెద్దలున్నారు.. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు‘ అంటూ బహిరంగంగానే సవాల్ విసిరారు.
గత పాలక వర్గం లో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్లు అంతా సిండికెట్ గా మారి ఈ అవినీతి వవ్యరాలను చక్కబెట్టినట్లు తెలుస్తుంది. అయితే, ఇప్పుడు ఏసీబీ రంగంలోకి దిగడం, ఇంటెలిజెన్స్ విభాగం రెవెన్యూ రికార్డులను సైతం తవ్వుతుండటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఇప్పుడైనా చర్యలు ఉంటాయా?
గత పాలకవర్గం హయాంలో అటకెక్కిన విజిలెన్స్ నివేదికలను ఏసీబీ మళ్లీ బయటకు తీసింది. ఈ విచారణ కేవలం బడంగ్పేటకే పరిమితమవుతుందా లేక ఆదిభట్ల, తుక్కుగూడ,శంషాబాద్, మణికొండ, నార్సింగ్, బండ్లగూడ జాగీర్, పెద్ద అంబర్పేట్, తుర్కయంజాల్ వంటి ఇతర శివారు మున్సిపాలిటీలకూ పాకుతుందా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా, ప్రజల సొమ్మును తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు పంచుకున్న అధికారుల ఆట కట్టే సమయం ఆసన్నమైందని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




