పేరుకే సతి.. పాలించేది పతి!
కుర్చీపై ఆమె.. కూర్చేదంతా ఆయనే
మహిళా సర్పంచులు సంతకం,
ఫొటోలకే పరిమితం
వారి భర్తలవే నిర్ణయాలు
అన్నీ చూస్తూ అధికారులు మౌనం
మహిళ వార్డు సభ్యుల పరిస్థితి కూడా అంతే
మోతె, మార్చి 20 : సమాజంలో ఆడవారికి ప్రాధాన్యత కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వాలు వారికి అన్ని రంగాల్లో రిజర్వేషన్ లను అమలు చేస్తుంది. అందులో భాగంగానే రాజకీయాల్లోనూ వారికి రిజర్వేషన్ లను కల్పించింది. అయితే అమలు తీరులో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతుందనేది అందరికి తెలిసిన విషయమే.
పోటీలో నిలిచి గెలుపొందిన తర్వాత వారు కేవలం కుర్చీపై కూర్చొని సంతకాలు చేయడానికి, ఫోటోలకు మాత్రమే పరిమితమవుతున్నా రనేది అందరి నోటి వెంట వెలువడుతున్న విమర్శ. దీంతో సర్పంచ్ లుగా పేరుకే సతి.. పాలించేది పతే.. అనే చందంగా గ్రామాలలో పరిస్థితి నెలకొంది. అయితే ఇదే విధానం ప్రస్తుతం మోతె మండలంలోనూ కొనసాగుతున్నట్లు వినికిడి.
మండలంలో ఇదీ పరిస్థితి..
మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికైన మహిళ సర్పంచుల స్థానంలో వారి భర్తలే అధికారాలను వినియోగిస్తూ ప్రజలు కూడా వారినే సర్పంచ్ అని పిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుందని స్థానికులే విమర్శిస్తున్నారు. మహిళలకు అధికారాలు ఇచ్చిన సమాజంలో ఉన్న పాత అభిప్రాయాలు మారకపోతే మహిళా నాయకత్వానికి పూర్తిస్థాయి గుర్తింపు రాదని చెబుతున్నారు.
ఇందులోనే మహిళా సర్పంచుల పాత్ర చాలా చోట్ల కుర్చీలపై కూర్చుంటూ సంతకాలకు, ఫోటోలకే పరిమితం అవుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామ అభివృద్ధి నిర్ణయాలు అధికారులతో మాట ముచ్చట్లు కూడా చాలా సందర్భాల్లో సర్పంచ్ భర్తలతోనే జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా మహిళా వార్డు సభ్యుల పరిస్థితి కూడా చాలా చోట్ల ఇదే విధంగా ఉందని అంటున్నారు. వార్డు సభ్యుల స్థానంలో వారి భర్తలే వ్యవహారాలు చూసే పరిస్థితి నెలకొందని స్థానికంగా బలంగా వినిపిస్తుంది.
మండలంలో 11 మంది మహిళా సర్పంచ్ లే..
మండలంలో 29 గ్రామపంచాయతీలకు 11 మంది మహిళా సర్పంచులు ఎన్నికైనారు. అయితే ఈ 11 చోట్ల మహిళా సర్పంచ్ ల పాత్ర అంతంతాగానే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాల్లో భార్య గునపం, భర్త పారా పట్టుకొని దిగడం ప్రక్కన కొన్ని సందర్భాలలో అధికారులు కూడా ఫోటోలు దిగడం సహజమనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ ఫోటోలు చూసిన ప్రజలు ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళలకు ఇచ్చిన హక్కులు నిజంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యావంతులు, సామాజికవేత్తలు కోరుతున్నారు. మహిళలు స్వయంగా బాధ్యతలు చేపట్టి నాయకత్వం వహించే పరిస్థితి రావాలంటే ప్రజల్లో కూడా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మహిళలే నిర్ణయాలు తీసుకోవాలి..
మండలంలో 29 గ్రామపంచాయతీలలో 11 గ్రామపంచాయతీలకు మహిళా సర్పంచులు ఉన్నారు. ఆ 11 గ్రామాలకు సంబంధించిన ఏ నిర్ణయమైనా మహిళా సర్పంచులే తీసుకోవాలి. గ్రామస్థులు సైతం తమ సమస్యలను కేవలం సర్పంచ్ లకు మాత్రమే చెప్పి పరిష్కరించుకోవాలి. సర్పంచుల భర్తలను సర్పంచ్ అని పిలిస్తే మహిళకు ప్రాధాన్యత తగ్గిస్తున్నట్లే. ఈ విషయమును దృష్టిలో ఉంచుకుని విద్యావంతులు, మేధావులు మహిళలను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలి. మహిళా సర్పంచ్‌ల భర్తలు కూడా వారే నిర్ణయాలు తీసుకునేలా బాధ్యతగా నడుచుకోవాలి
తిప్పని ఆంజనేయులు, ఎంపీడీవో, మోతె




