గొత్తికోయ గూడెల్లో పల్స్‌పోలియో
వెంకటాపూర్, జూన్ 30 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. సి.హెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బందిలతో కలిసి మంగళవారం మండలంలో రవాణా సౌకర్యం లేని గుత్తికోయ గిరిజన ఆవాసాలకు నడక మార్గాన చేరుకుని ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ సి.హెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. తొర్రి చింతలపాడు గిరిజన ఆవాసంలో 15 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. అలాగే మండలంలో రవాణా సౌకర్యం లేని రోలు బండ, బండ్లపాడు చాకిరేవులు, నందిపాడు, తొర్రి చింతలపాడు గుత్తికోయ గిరిజన ఆవాసాల్లో మొత్తం 85 మంది ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు అందించినట్లు వెల్లడించారు.
మూడు రోజుల పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మండలంలోని 10,200 గృహాలను ఆరోగ్య సిబ్బంది సందర్శించి, పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలను గుర్తించి వారికి చుక్కలు వేశారని తెలిపారు. దీంతో మండల వ్యాప్తంగా మొత్తం 2,438 మంది ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి 100 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు మోతీలాల్, సుశీల తదితరులు పాల్గొన్నారు.






