19-09-2025 12:00:00 AM
అంతర్జాతీయ వేదికపై భారత మహిళా బాక్సర్లు సత్తా చాటారు. లివర్‌పూల్ వేదికగా జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో వివిధ విభాగాల్లో భారత్‌కు చెందిన నలుగురు మహిళా బాక్సర్లు పతకాలతో మెరిశారు. మహిళల 48 కేజీల విభాగంలో మీనాక్షి హుడా, 57 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియా స్వర్ణ పతకాలు గెలవగా.. 80 ప్లస్ కేజీల విభాగంలో నుపుర్ షెరాన్ రజతం, 80 కేజీల విభాగంలో వెటరన్ బాక్సర్ పూజా రాణి కాంస్యంతో మెరిసింది.
ఈ విజయాలు భారత బాక్సింగ్‌ను మరింత పదును ఎక్కించాయనడంలో సందేహం లేదు. అంతేకాదు వీరి విజయాలు ఒలింపిక్స్ సహా భవిష్యత్తులో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లోనూ భారత్‌కు ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నాయి. విదేశీ గడ్డపై జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఒకేసారి భారత్‌కు చెందిన నలుగురు మహిళా బాక్సర్లు పతకాలు కొల్లగొట్టడం గొప్పవిషయం.
ఇదే టోర్నీలో స్టార్ బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గొహైన్ పతకాలు సాధించడంలో విఫలమైనప్పటికీ భారత్‌కు మేము పతకాలు తీసుకొస్తామంటూ మీనాక్షి హుడా, జాస్మిన్ లంబోరియాలు స్వర్ణ పతకాలు సాధించి భారత జాతీయ పతకాన్ని రెపరెపలాడించారు. ఇప్పటివరకు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు నెగ్గిన వారిలో మేరీకోమ్, నిఖత్ జరీన్, సరితా దేవి, జెన్నీ, లేఖ, నీతూ, లవ్లీనా, స్వీటీ బూరా ఉండగా.. తాజాగా వీరి సరసన మీనాక్షి, జాస్మిన్ నిలవడం విశేషం.
ఇక నుపుర్ షెరాన్, పూజా రాణి ప్రదర్శన కూడా తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. అత్యంత క్లిష్టమైన కేటగిరీల్లో పోటీ పడిన ఈ ఇద్దరు పతకాలతో సత్తా చాటారు. ముఖ్యంగా వెటరన్ బాక్సర్ పూజా రాణికి లివర్‌పూల్ టోర్నీ మంచి కమ్‌బ్యాక్ అని చెప్పొచ్చు. దాదాపు 15 ఏళ్ల కెరీర్‌లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పూజా రాణి ఏనాడు పతకం గెలవలేదు. అయితే ఈసారి మాత్రం పట్టుదలతో రింగ్‌లో తన పంచ్ పవర్‌ను రుచి చూపించి కాంస్యాన్ని ఒడిసిపట్టింది.
లివర్‌పూల్‌లో మహిళా బాక్సర్లు సాధించిన విజయాలు భవిష్యత్తులో మరింత మంది యువ బాక్సర్లు రింగ్‌లోకి అడుగుపెట్టేందుకు దోహదపడనుంది. భారత మహిళల బాక్సింగ్ ప్రధాన కోచ్ డాక్టర్ చందూలాల్ లివర్‌పూల్‌లో మన అమ్మాయిల ప్రదర్శనను మెచ్చుకుంటూనే పరోక్షంగా హెచ్చరికలు చే యడం గమనార్హం. టోర్నీలో నిరాశజనక ప్రదర్శన కనబరిచిన నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గొహైన్‌లు గతంలో విజయాలు సాధించామనే ధోరణితో వి శ్రాంతి తీసుకోకుండా తమ విజయాలపై దృష్టి సారించాలన్నారు.
లివర్‌పూల్‌లో మన బాక్సర్లు సాధించిన ఘనత తక్కువేమి కాదని.. దీన్ని ఒక లాంచ్‌పాడ్‌గా ఉపయోగించుకొని రాబోయే టోర్నీలు సహా ఒలింపిక్స్‌లో అదరగొట్టాలన్నారు. 2036 ఒలింపిక్స్, 2030 కామన్‌వెల్త్ గేమ్స్ కోసం భారత్ బిడ్ దాఖలు చేయాలని భావిస్తున్న వేళ బాక్సింగ్‌లో ఇవాళ మన మహిళలు సాధించిన విజయాలు పతక ఆశలను రెట్టింపు చేసింది.
వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన మీనాక్షి, జాస్మిన్, నుపుర్, పూజా రాణిలు హర్యానాకు చెందినవారు కావడం విశేషం. ఒకప్పుడు రెజ్లర్ల గడ్డగా పేరు పొందిన హర్యానా ఇప్పుడు మంచి బాక్సర్లను కూడా దేశానికి అందిస్తోంది. ఈ నేపథ్యంలో బాక్సింగ్ క్రీడలో భారత్‌కు భవిష్యత్తులోనూ కొత్త చాంపియన్లు పుట్టుకొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.