10 March, 2026 | 3:09 AM

హెచ్‌సీఏలో పైరవీలు,

09-03-2026 02:48 AM

డబ్బులు తీసుకుని సెలెక్ట్ చేసే దుస్థితి

ప్రతిభతో క్రీడల్లో రాణించే పరిస్థితి లేకపోవడం బాధాకరం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్, మార్చి 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రతిభతో క్రీడల్లో రాగణించే పరిస్థితి లేకపోవడం బాధాకరమని, అందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ సీఏలో సెలెక్ట్ కావాలంటే పైరవీ లు, డబ్బులు  తీసుకొని సెలెక్ట్ చేసే సంస్కృతిని కొందరు తీసుకొచ్చారని, క్రీడాకారుల ప్రతిభను దెబ్బతీసే దుర్మార్గానికి చరమ గీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని క్రీడాకారుల కోసం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఈనెల 1 నుండి 7 వరకు “ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్‌”పేరిట  ఆటల పోటీలు నిర్వహించారు. ఆదివారం నగరంలోని హోటల్ “త్రిద”లో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి  బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవన శైలిలో క్రీడలు ఒక భాగమని, క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకునే కాకుండా, మానసిక సమస్యలను దూరం చేస్తాయన్నారు.

క్రీడలు క్రమశిక్షణ, బృందస్ఫూర్తి, చెట్టుగా పనిచేసే తత్వం, నాయకత్వ లక్షణాలు, వ్యూహరచన నైపుణ్యం, విమర్శనాత్మక ఆలోచన అలవాడేలా చేస్తాయన్నారు.  ఈ ఆధునిక కాలంలో విద్య ఎంత అవసరమో క్రీడలు అంతే అవసరం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ప్రధానమంత్రి  సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో  ప్రతిభ కలిగిన క్రీడాకారులను  ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రీడా పోటీలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని యువతకు ఇదొక మంచి వేదిక అయిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి,  నగరపాలక సంస్థ  మేయర్ కోలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్లమెంటు కన్వీనర్  బోయిన్పల్లి ప్రవీణ్ రావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు  గుజ్జ శ్రీనివాస్, మాడ వెంకటరెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.