20 August, 2026 | 1:29 PM

పిట్ట మనసు.. పెద్దలకు తెలుసు

23-05-2024 06:48 AM

 గజ్వేల్, విజయక్రాంతి: పిట్టలు, పక్షులతో మానవులకు గల అనుబంధం ఎలాంటిదో రైతులకు, ముఖ్యంగా వయస్సు మల్లిన పెద్దలకు తెలుసు. పక్షుల వల్లే అడవులు, అరుదైన మొక్కలు ఇంకా బతుకుతున్నాయంటే ఆశ్చర్యమేమీ లేదు. అయితే పక్షులకు రైతులకు విడదీయలేని బంధమే ఉంది. పంటలను ఆశించే క్రిమికీటకాదులను నాశనం చేయడానికి ఇప్పుడు రసాయన మందులు ఉన్నాయి. కానీ, పూర్వం పక్షులే పంటల మీది క్రిమికీటకాలను భక్షించి పంటలకు రక్షణగా ఉండేవి.

రానురాను రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంతో పక్షుల సంతతి అంతరించిపోతున్నదని అందరికీ తెలిసిందే. కానీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో మాజీ సర్పంచ్ తూం శేఖర్ పటేల్ ఇప్పటికీ పక్షుల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పక్షుల ఆహారం కోసం ఇంటి దూలలకు వరి కోయ్యలను కడుతూ గ్రామస్తులకు పక్షులపై అవగాహన కల్పిస్తున్నారు. చైనాలో ఇటీవల పక్షులు లేకనే పంటలు నశించిపోతున్నాయనే సమాచారాన్ని పలువురికి వివరిస్తూ.. స్వయంగా పక్షుల రక్షణ తీసుకుంటున్న చర్యలతో వాటి విలువను సమాజానికి చాటుతున్నారు.