calender_icon.png 10 February, 2026 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యతకు తిలోదకాలు

10-02-2026 12:28:53 AM

  1. పగుళ్ళు పట్టిన సీసీ రోడ్లు..
  2. లక్షల ప్రజా ధనం వృథా 
  3. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు

గుండాల, ఫిబ్రవరి 9 : కాంట్రాక్టర్ల స్వార్థపూరిత ఆలోచనలకు ప్రజాధనాన్ని వృధా చేశారు ధన దాహంతో నిండిన కాంట్రాక్టర్లు.గుండాల మండలంలోని నూనెగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్జీఎస్) నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు నాణ్యత లేక మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. నిర్మాణ పనులు పూర్తయిన నెలలు గడవకముందే రోడ్లపై పగుళ్లు రావడంతో గ్రామ ప్రజలు పగుళ్ళు పట్టిన రోడ్డు పై కూర్చుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ,బిల్లులు నిలిపి వేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.

గత  ప్రభుత్వ హయాంలో మంజూరైన ఈ పనులను ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పూర్తి చేయాలనే తొందరలో కాంట్రాక్టర్లు నాణ్యతను పూర్తిగా విస్మరించి హడావుడిగా పనులు పూర్తి  చేశారని గ్రామస్థులు ఆరోపించారు. అధికారులు పర్యవేక్షణలో నిర్లక్షానికి నిదర్శనం అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 2022-2023 సంవత్సరంలో రూ. లక్షల వ్యయంతో రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి అనుమతులు లభించాయి.   

ఒకేసారి అనేక పనులు చేపట్టి రాత్రింబవళ్లు నిర్మాణాలు నిర్వహించి అనంతరం బిల్లులు సమర్పించడం సాధారణంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.  నిర్మించిన కొద్ది రోజుల్లోనే రోడ్లు ఎక్కడికక్కడ పగుళ్లు వచ్చాయి. సిమెంట్, ఇసుక, కంకర సరైన నిష్పత్తిలో ఉపయోగించకపోవడం వల్ల రోడ్ల నాణ్యత తగ్గిందని  గ్రామస్థులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం 15 సెంటీ మీటర్ల మందంతో నిర్మించాల్సిన రోడ్లను తక్కువ మందంతో నిర్మించారన్న ఆరోపణలు  వినిపిస్తున్నాయి. అధికారులు తక్షణ మే స్పందించి సీసీ రోడ్ల నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

పనులను సాంకేతిక ప్రమాణాల ప్రకారం నిర్వహించలేదని వారిపై  కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో పారదర్శకత తీసుకురావాలని, పనుల నాణ్యత ను తనిఖీ చేసి అవసరమైతే పునర్నిర్మాణం చేపట్టాలని, బిల్లులు నిలిపివేయా లని ప్రజలు కోరుతున్నారు. నిరసన కార్యక్రమం లో గ్రామస్తులు కప్పరి కనకరెడ్డి, జిట్ట సత్తయ్య, గన్న వెంకట్ రెడ్డి, అండెం ప్రశాంత్ రెడ్డి, గన్న లక్ష్మారెడ్డి, బుషిగంపల కృష్ణ, నవీన్, చిటికలయ్య రాజశేఖర్ రెడ్డి తదితర గ్రామస్థులు పాల్గొన్నారు.