16 June, 2026 | 1:40 AM

ప్రతీ విద్యార్థికి నాణ్యమైన భోజనం అందించాలి

16-06-2026 12:11 AM

డీఈఓ విజయలక్ష్మి

ఎర్రవల్లి, జూన్ 15: ఎర్రవల్లి మండలంలోని పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి సోమవారం సందర్శించి విద్యా, పరిపాలన అంశాలతో పాటు మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. ఎంపీయూపీఎస్ తిమ్మాపూర్, జడ్పీహెచ్‌ఎస్ ఎర్రవల్లి బేటలియన్, జడ్పీహెచ్‌ఎస్ కొండేరు తదితర పాఠశాలలను సందర్శించి విద్యార్థుల అభ్యాస స్థాయిని సమీక్షించారు. తిమ్మాపూర్, కొండేరు పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు.

మధ్యాహ్న భోజన పథకంలో వంటశాలలు, ఆహార నిల్వలు, పరిశుభ్రతను తనిఖీ చేసిన డీఈఓ, విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించడంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు సకాలంలో అందేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జె. అమీర్ పాషా, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.