నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం..
చండూరు (విజయక్రాంతి): నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం(CPM District Secretary Group Member Banda Srisailam) అన్నారు. గురువారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం ఆ పార్టీ సీనియర్ నాయకులు చిట్టిమిల్ల లింగయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నకిలీ విత్తనాలు అరికట్టడంతోపాటు రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను, పురుగుమందులను అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు, సీజన్ ప్రారంభ దశలోనే ఉన్నందున రెవిన్యూ, వ్యవసాయ అధికారులు, పోలీస్ అధికారుల పర్యవేక్షణలో నకిలీ వ్యాపారస్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
గతంలో రైతు భరోసా పెండింగ్లో ఉన్నటువంటి వారికి, 2025 కరిపి సీజన్ రైతు భరోసా రైతు ఖాతాలోని జమ చేయాలని ఆయన అన్నారు. రుణమాఫీ కానటువంటి రైతాంగానికి రుణమాఫీ చేసి తిరిగి పంట రుణాలు ఇవ్వాలని ఆయన అన్నారు. కొత్తగా పాస్ బుక్కు గలిగిన రైతాంగానికి నాబార్డ్ స్కేల్ ఆప్ ఫైనాన్స్ ప్రకారంగా రుణ పరిమితిని పెంచి రైతులకు పంట రుణాలు అందించాలని ఆయన అన్నారు. బీటి-3 ప్రత్తి విత్తనాలు నాటిన వారికి , ఆ పొలంలో పనిచేసే వారందరికీ క్యాన్సర్, చర్మ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ఈ విత్తనాల పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. బీటి-3 విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది అంటే మనం అర్థం చేసుకోవాలన్నారు.
భూభారతిపై రెవెన్యూ అధికారులు సరిగ్గా అవగాహన కల్పించకపోవడంతో ప్రజల నుండి స్పందన కరువైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సిపిఎం మండల కమిటీ సభ్యులు మొగుదాల వెంకటేశం, చిట్టిమల్ల లింగయ్య, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం,రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.






