నాణ్యమైన బోధన, భోజనం అందించాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్/వాంకిడి, ఏప్రిల్ 9(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని కలెక్టర్ హరిత అన్నారు. గురువారం వాంకిడి మండలం బెండారా గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన వంటశాల, మూత్రశాలలు, తరగతి గదులు పరిశీలించి, విద్యార్థులు రాస్తున్న వార్షిక పరీక్షల తీరును గమనించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కూడా సూచించారు. అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) భద్రపరిచిన గోదాం వద్ద పటిష్ట భద్రత చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిత తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను నెలవారీ తనిఖీలలో భాగంగా కలెక్టర్ సందర్శించారు.
గేటుకు సీలుతో వేసిన తాళాలు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని ఉద్యానవనాన్ని పరిశీలించి, సందర్శకులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు నీడనిచ్చే చెట్లు, పూల మొక్కలను పెంచాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ఏర్పడిన గుంతలను మొరం వేసి చదును చేయాలని సూచించారు.
అలాగే ఆసిఫాబాద్ మండలం సాలేగుడాలో ఏర్పాటు చేసిన వెదురు కళాకృతుల వర్క్‌షాప్‌కు విద్యుత్ సౌకర్యం కల్పించి కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిత తెలిపారు. గురువారం సి.ఎస్.ఆర్ నిధులతో ఆర్‌ఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెదురు కళాకృతుల వర్క్‌షాప్‌ను కలెక్టర్ సందర్శించారు. గతంలో శిక్షణ పొందిన వారికి స్టైఫండ్, కిట్లు, శిక్షణ సర్టిఫికెట్లు అందలేదని తెలియజేయగా వాటిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మెదర సంఘం ప్రధాన కార్యదర్శి రాపాల శ్రీనివాస్, కళాకారులు మహేందర్, నర్సయ్య, రాజేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




