18-11-2025 12:59:00 AM
పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై క్యాబినెట్ నిర్ణయం
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపరంగానే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, పాత రిజర్వేషన్ల ప్రకార మే ఎన్నికలు జరుగుతాయని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం తర్వాత మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి మంత్రి పొంగులేటి మీడి యా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
బీసీ కోటా అంశం ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉందని, దీంతో ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, కోర్టు అంశం తేలిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణ యం తీసుకుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 9వ తేదీకి రెండేళ్లు పూర్తవుతుండటంతో డిసెంబబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పాల న వారోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలి పారు. లోకల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్రప్రభుత్వం భావించిందని, అందు కు క్యాబినెట్ ఆమోదం చేసి, అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్‌కు పంపించామని గుర్తుచేశారు. ఆ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు. తర్వాత క్యాబినెట్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొస్తే కొందరు వ్యక్తు లు హైకోర్టుకు వెళ్లారని, దీంతో న్యాయస్థానం స్టే విధించిందని గుర్తుచేశారు.
హైకోర్టు ఇచ్చిన స్టేని సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు సైతం వెళ్లిందని, సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసిందని తెలిపారు. దీంతో ప్రభుత్వం 50% రిజర్వేషన్ల పరిమితి మించకుండా పంచా యతీ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. మార్చి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించపోతే, కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం నుంచి రావాల్సిన రూ.3 వేల కోట్లు నిధులు నష్టపోయే ప్రమాదం ఉన్నందున క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 లక్షల మంది గిగ్ కార్మికులకు పూర్తి భద్రత, భరోసా కల్పించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆలోచనలకు అనుగుణంగా గిగ్ వర్కర్లకు భద్రత కల్పిస్తున్నా మని వివరించారు. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 3 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారని, వీరంతా మొబిలిటీ, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఈనూ కామర్స్, లాజిస్టిక్స్‌తోపాఉట ఇతర రంగాల్లో పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఇళ్లలో పని చేసే వారికి ఎంటి సెలవులు లేకపోగా, రోజుకు 10 నుంచి 12 గంటలకు పని చేయాల్సి వస్తోందని, వారికి కూడా ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.
వచ్చే నెల 8, 9వ తేదీల్లో గ్లోబల్ సమ్మిట్
ప్రజాప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 9కి రెండేళ్లు పూర్తవుతున్నందున ప్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్లను ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను 8వ తేదీన జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో వివరిస్తామన్నారు.
రింగ్ రోడ్డు లోపలి ఇండస్ట్రియల్ భూమిని మల్టీ యూజ్ జోన్‌గా మార్చేందుకు రూపొందించిన ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ’కీ క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేశారు. అలాగే సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ చెప్పారు.
మరోసారి క్యాబినెట్ సమావేశం
డెడికేటెడ్ కమిషన్ బీసీలకు 42శాతం కోటాను సిఫార్సు చేస్తూ నివేదిక అందించింది. దీనిప్రకారం రాష్ట్రప్రభుత్వం ఎన్నికల ప్రక్రియ సైతం ప్రారంభించింది. ఈ క్రమం లో బీసీ కోటా అంశం కోర్టు కేసుల స్థాయి లో ఉండిపోయింది. ఇప్పుడు ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతం పరిమితి మించకుండా వెళ్లాలంటే, డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక తెప్పించుకోవాల్సి ఉం టుంది. అందుకు పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్ నుంచి నివేదిక కోరాలని క్యాబినెట్ నిర్ణయించింది.
వారంరోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి, క్యాబినెట్ ఆమోదం పూర్తి చేయాలని నిశ్చయించింది. దీనిలో భాగంగానే వారంలో మరోసారి క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని క్యాబినెట్ నిర్వహించింది.మరోవైపు 50శాతం పరిమితి మించకుండా పంచాయతీ ఎన్నికలకు వెళితే, రిజర్వేషన్లు మారనున్నాయి. ఎన్నికల కమిషన్ పాత రిజర్వేషన్ల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది.
అందె శ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువు
వాగ్గేయకారుడు, రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మృతి నేపథ్యంలో ఆయన కుమారుడు దత్తసాయికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని క్యాబినెట్‌లో తీర్మానించినట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. అలాగే అందెశ్రీ అంత్యక్రియలు జరిగిన స్థలంలో స్మృతి వనం ఏర్పాటు చేస్తామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రగీతం ‘జయ జయ హే తెలంగాణ’ పాటను పాఠ్య పుస్తకాల్లో మొదటి పేజీలో ముద్రిస్తామని తెలిపారు.