కోటా కొట్లాట

02-05-2024 12:10:00 AM

సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిసారీ జాతీయ స్థాయిలో ఓ అంశం ప్రధాన ప్రచార అంశంగా ఉంటోంది. గతంలో ఇందిరాగాంధీ హయాంలో గరీబీ హఠావో,  ఆ తర్వాతి కాలంలో బాబ్రీ మసీదు కూల్చివేత వివాదం, మండల్ కమిషన్ నివేదిక .. ఇలా ప్రతి ఎన్నికలోను ఒక్కో అంశం ఓటర్లను ప్రభావితం చేస్తూ వచ్చింది. ఈసారి 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొదట్లో బీజేపి అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకోవాలని భావించింది. కానీ, ఆ అంశం  ఉత్తరాది రాష్ట్రాల ఓటర్లను ప్రభావితం చేసినంతగా దక్షిణాది రాష్ట్రాలను ప్రభావితం చేయక పోవడంతో ఆ పార్టీ కొత్త ప్రచారాస్త్రాలను వెతకడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ, ‘ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను లాక్కొని వలసదారులకు, ఎక్కువ సంతానం ఉన్నవారికి పంచి పెట్టేస్తుందని’ పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను విమర్శించే క్రమం లో ఉద్దేశ పూర్వకంగానో లేదా అనుకోకుండనో ముస్లింల ప్రస్తావన తీసుకురావడంతో కాంగ్రెస్ పార్టీ సైతం దాన్నే ఆయుధంగా చేసుకుని ప్రధాని పైనా, బీజేపీపైనా ఎదురు దాడి మొదలుపెట్టింది. 

బీజేపీకి గనుక ఈ ఎన్నికల్లో మూడింట రెండు వంతులకుపైగా మెజారిటీ వస్తే  బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చి వేస్తుందని,  రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తుందంటూ తీవ్రస్థాయిలోఆరోపణలు చేసింది.  తెలంగాణలోని చేవెళ్ల ఎన్నికల ప్రచారసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ‘కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తా’మన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కు లను వారికే కల్పిస్తామన్నారు. అమిత్ షా మాటలను కొందరు వక్రీకరించారు. ‘రిజర్వేషన్లు అన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తామని’ అమిత్ షా చెప్పినట్లుగా ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడి నుంచి దీనిపై వివాదం మొదలయింది. ‘ఎస్సీలు, ఎస్టీలు, బీసీల హక్కయిన రిజర్వేషన్లను రద్దు చేయాలని ప్రయత్నిస్తే మాడి మసై పోతారంటూ’ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు.

రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ఎవరుకూడా రద్దు చేయలేరని, అలా చేయడానికి ప్రయత్నిస్తే దేశ ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఫేక్ వీడియో వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్‌రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. అమిత్‌షాతో పాటు బీజేపీ నేతలంతా ఈ ఆరోపణలపై ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. రిజర్వేషన్లను రద్దు చేసే, రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన తమ పార్టీకి లేదని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ కూడా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టారు. రాజ్యాంగం అంటే తనకు ఎంతో గౌరవమని, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని అంబారీపై ఊరేగించానని ఆయన గుర్తు చేశారు. చివరికి అంబేద్కరే తిరిగి వచ్చి రాజ్యాంగాన్ని మార్చాలని కోరినా మార్చబోమని తేల్చి చెప్పారు. 

‘బీజేపీ నేతలు పైకి చెప్పేదొకటి, చేసేది మరొకటి, రిజర్వేషన్లను రద్దు చేసేందుకు రాజ్యాంగాన్ని మార్చాలనేదే వారి అసలు ఉద్దేశం’ అని’ రాహు ల్ గాంధీ అంటున్నారు. ‘రిజర్వేషన్లు రద్దు చేసే ఉద్దేశం లేకపోతే ప్రభుత్వ సంస్థలను, రైల్వేలను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారు? సైన్యంలోకి అగ్నివీర్ పథకాన్ని ఎందుకు తీసుకు వస్తున్నారు’ అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో ని భిండ్‌లో ఓ ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ, ‘రాజ్యాంగం ఈ దేశ ప్రజల హృదయం.  దీన్ని ఎవరు కూడా తాకలేరు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా దీన్ని మార్చలే’దు’ అంటూ  తీవ్రస్వరంతో మండిపడ్డారు. ‘బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందా? రిజర్వేషన్లను రద్దు చేస్తుందా?’ అనే విషయం అలా ఉంచితే ప్రస్తుతానికైతే ఎన్నిక లు ముగిసేవరకు ఈ అంశంపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, ఆరోప ణలు, ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉంటాయనేది మాత్రం నిజం.