09-11-2025 02:50:54 PM
కరీంనగర్,(విజయక్రాంతి): కొండగట్టు జేఎన్టీయూ కాలేజీలో సీనియర్ విద్యార్థుల పైశాచికత్వం బయటపడింది. జగిత్యాల జిల్లా ఎస్ పి రెండు రోజిల క్రితం కాలేజీ ని సందర్శించి ర్యాగింగ్ కి, మరకద్రవ్యాల కు దూరంగా ఉండాలని హితబోధన చేసిన రోజుకు ముందు రోజే ర్యాగింగ్ సంఘటన చోయు చేసుకొంది. కొత్తగా చేరిన విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాల్సిన సీనియర్లు వేదింపులు శృతి మించిపోయేలా చేశారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చర్చకు దారి తీస్తున్నాయి.
కొండగట్టు జెఎన్టీయూలో జరిగిన ర్యాగింగ్ పై పోలీసులకు కానీ, కాలేజీ ఉన్నతాధికారులకు కానీ ఎలాంటి ఫిర్యాదులు రానట్టుగా తెలుస్తోంది. ర్యాగింగ్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో కాలేజీలో క్రమశిక్షణ కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూనియర్ విద్యార్థులకు ర్యాగింగ్ చేసిన సీనియర్లు మగ వారికిద్దిరికి వివాహం తంతు జరిపించినట్టుగా వీడియోల్లో స్పష్టం అవుతోంది.
మాంగళ్య ధారణ చేయించడం అనంతరం అరుంధతి నక్షత్రం చూపించడంతో పాటు ఇతరాత్ర అన్ని రకాల ఫార్మాలిటీస్ చేయించినట్టుగా వీడియోల్లో స్పష్టం అవుతోంది. కొంతమంది విద్యార్థులను చున్నీలతో ఓణీ కట్టుకుని డ్యాన్సులు చేయించడంతో పాటు పలు రకాలగా జూనియర్లను వేధింపులకు గురిచేశారు. కొండగట్టు జెఎన్టీయూలో వరసగా జరుగుతున్న ఘటనలు ఆందోళనకు దారి తీస్తున్నాయి. జూనియర్లపై ర్యాగింగ్ కు పాల్పడినతీరుపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.