20 June, 2026 | 2:39 AM

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

20-06-2026 12:09 AM

ఆశ్రయ్- -హాజరైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ 

జూబ్లీహిల్స్, జూన్ 19 (విజయక్రాంతి): శ్రీనగర్ కాలనీలో ఆశ్రయ్-ఆకృతి పాఠశాలలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ వేడుకలకు జూబ్లీహిల్స్ నియో జకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. దివ్యాంగ విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి వారితో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినికిడి, మాట్లాడే సమస్యలు కలిగిన చిన్నారులకు ఆశ్రయ్-ఆకృతి అందిస్తున్న సేవలను కొనియాడారు.

వారికి విద్య ను బోధిస్తూ, నాణ్యమైన వైద్యం అందేలా చూస్తూ అండగా నిలవడం అభినందనీయమన్నారు. ప్రతి ఏడాది వేలాది మంది ది వ్యాంగ విద్యార్థులు సంస్థ ద్వారా సహాయం పొందుతున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల మధ్య జరుపు కోవడం ఆనందంగా ఉందన్నారు. సంస్థకు ప్రభుత్వం తరపున అన్ని విధాల సహకరిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశ్రయ్-ఆకృతి వ్యవస్థాపకుడు డాక్టర్ డిపికే బాబు, డైరెక్టర్ శశికళ, ప్రిన్సిపాల్ సారిక, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నేత డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో...

సికింద్రాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని  పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. లోక్ సభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా సనత్ నగర్, బీకే గూడ, అమీర్ పేట్, బేగంపేట్, రాంగోపాల్ పేట్, బన్సీలాల్ పేట్, పద్మారావు నగర్, ఎస్సార్ నగర్ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదానం, చీరల పంపిణీ చేపట్టి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి అన్నదానం నిర్వహించి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తున్న గొప్ప నాయకులు రాహుల్ గాంధీ అని వెల్లడించారు. దేశంలో అణగారిన వర్గాలు, మహిళలు, పేదలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ, బాధితులకు అండగా ఉంటూ పార్లమెంట్ లో గళం విప్పుతున్నారని తెలిపారు. భారత దేశ భవిష్యత్ ఆశా జ్యోతి రాహుల్ గాంధీ అని..

భారత్ జోడో న్యాయ్ యాత్ర ద్వారా అందరికీ చేరువై అన్ని వర్గాల సమస్యలను తెలుసు కొని తెలంగాణలో కులగణన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేశారని తెలిపారు. రాహుల్ గాంధీ నిబద్ధత, నిజాయతీ, ప్రజలకు మేలు చేయాలన్న తపన ఎంతో మెచ్చుకో దగ్గదన్నారు. బాధలో ఉన్న ప్రతి ఒక్కరి కన్నీరు తుడవడానికి ఆయనెప్పుడూ ముందుటారని తెలిపారు. భిన్నత్వం, సామరస్యం, కరుణ అనేది కాంగ్రెస్ పార్టీ తత్వం అని,ఇవన్నీ రాహుల్ గాంధీలో కనిపిస్తాయన్నారు. సడలని పట్టుదలతో రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ సుదీర్ఘమైన,ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని.. పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని డాక్టర్ కోట నీలిమ ఆకాంక్షించారు.