12 August, 2026 | 1:21 AM

రాహుల్.. మీతో ఉన్నది ఎవరు?

12-08-2026 12:18 AM
  1. ఆ ఫొటో ఎక్కడ? ఎప్పుడు? తీశారు?
  2. ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి గిరిరాజ్ ప్రశ్నలు
  3. ట్వీట్‌పై రాజకీయ దుమారం

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ‘రాహుల్‌జీ మీ పక్కన ఉన్న మహిళ, బాలుడు ఎవరు? ఈ ఫొటో ఎప్పుడు, ఎక్కడ తీసుకున్నారు అని కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టుపై రాజకీయ దుమారం రేగింది. దీనిపై కాంగ్రెస్ కూడా తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ మహిళ, చిన్నారితో పడవలో ఉన్న ఫొటోతో కేంద్ర మంత్రి గిరిరాజ్ చేసిన ట్విట్ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య రాజకీయ ప్రకంపనలు లేపుతున్నది.

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఫొటో ఎక్కడ? ఎప్పుడు? తీశారో చెప్పాలని కోరారు. రాహుల్‌తో ఉన్నది ఎవరని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఫొటోలో ఉన్న మహిళ, చిన్నారి రాహుల్ స్నేహితుడి భార్య, కుమారుడేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా తెలిపారు. వారంతా కుటుంబ విహారయాత్రలో ఉన్నప్పుడు ఈ ఫొటో తీశారని చెప్పారు.

రాహుల్ స్నేహితుడు మాత్రం చిత్రంలో లేరని వివరించారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి అవి దండియా మరో వివరాన్ని వెల్లడించారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న లేక్ రే రాబర్ట్స్ వద్ద ఈ ఫొటో తీసినట్లు తెలిపారు. గిరిరాజ్ సింగ్ స్వయంగా వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. గిరిరాజ్ సింగ్ తీరుపై సుప్రియా తీవ్రంగా స్పందించారు. మహిళ, పురుషుడు కలిసి కనిపిస్తేనే చెడు ఆలోచనలు వస్తున్నాయంటూ విమర్శించారు.

రాహుల్‌గాంధీ విదేశీ పర్యట నలపై బీజేపీ విమర్శలు కొనసాగిస్తోంది. జూన్ 22 నుంచి జూలై 13 వరకు ఆయన చేపట్టిన విదేశీపర్యటనపై బీజేపీ ఐటీ విభాగం అధిపతిఅమిత్ మాలవీయ గతం లో ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారు? పర్యటన ఖర్చులను ఎవరు భరించారని ప్రశ్నించారు. రాహుల్ విదేశీ పర్యటనల ఖర్చులు, భద్రతా నిబంధనలపైనా బీజేపీ గతంలో ఆరోపణలు చేసింది. విదేశీ పర్యటనలకు భారీగా ఖర్చు చేశారని ఆరోపించింది.