గర్భిణులకు అవగాహన సదస్సు
చౌటుప్పల్, ఆగస్ట్ 11 : గర్భధారణ సమయంలో మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సరైన పోషకాహారంతో పాటు వైద్యుల సలహాలు తప్పనిసరిగా పాటించాలని ప్రముఖ వైద్యులు సూచించారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని కళాశ్రీ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో గర్భిణులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎండి అత్ హర్ పాషా అధ్యక్షత వహించగా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దాచేపల్లి ప్రకాష్ గుప్తా, రీజియన్ చైర్పర్సన్ సంజీవరెడ్డి, జోన్ చైర్మన్ ఉప్పు ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సదస్సులో వైద్యులు డాక్టర్ వై. సూర్యశ్రీ, డాక్టర్ ప్రశాంతి రెడ్డి, డాక్టర్ అవ్వరు శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ గర్భిణులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం మాత్రలు వాడాలని సూచించారు. పరిశుభ్రమైన నీరు, తగినంత విశ్రాంతి తల్లి-బిడ్డల ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలిపారు. అధిక రక్తపోటు, తీవ్రమైన తలనొప్పి, కాళ్ల వాపులు లేదా బిడ్డ కదలికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని హెచ్చరించారు.
సురక్షిత ప్రసవం కోసం కుటుంబ సభ్యుల సహకారం చాలా కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి దాచేపల్లి రాజు గుప్తా, కోశాధికారి బత్తిని రఘు, నాంపల్లి రమేష్ గుప్తా, తిరందాసు జగన్ నాథ్, కాసుల వెంకటేశం గౌడ్, కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, గొప గోని లక్ష్మణ్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, సిలివేరు మంగయ్య, వనం రాజు, సంపూర్ణ చారి, పోలోజు రాజు, పోలోజు శ్రీనివాస చారి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.






