03-02-2026 01:50:20 AM
20౨౦లో భారత్‌లోకి చైనా యుద్ధ ట్యాంకర్లు
కేంద్రం ఎందుకు ఆ అంశాన్ని దాస్తుందో తెలపాలి
ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకంలోని అంశాలు అక్షర సత్యాలు
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు
అడ్డుకున్న కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్
పబ్లిష్ కాని పుస్తకంలోని అంశాలను ఎలా ప్రశ్నిస్తారని నిలదీత
న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౨: లద్దాఖ్, డోక్లాంలోకి 2020లో కొన్ని చైనా యుద్ధ ట్యాంకర్లు ప్రవేశించాయని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దాచిపెట్టాలని చూసిందని, ఇప్పటికైనా ఆ వాస్తవాన్ని వెల్లడించాలని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మా నం అంశంపై సోమవారం రాహుల్ గాంధీ అనేక అంశాలను ప్రస్తావించారు. దీనిలో భాగంగానే మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నర వణే స్వయంగా రాసిన ప్రచురితం కాని పుస్తకం ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’లోని కొన్ని అంశాలను సభలో ప్రస్తావించారు.
ఈ ప్రశ్నలతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. చైనా సైన్యం మెల్లమెల్లగా భారత సరిహద్దుల్లోకి చొరబడుతున్నదని నరవణే తన పుస్తకంలో రాసిన కొన్ని అంశాలను ఓ మ్యాగజైన్ ప్రచురించింది. వాటిని రాహుల్‌గాంధీ సభలో ఉటంకించారు. నరవణే పుస్తకంలోని అంశాలు నూటికి నూరు శాతం వాస్తవాలని వాదించారు. కేంద్రప్రభుత్వం అసలు వాస్తవాలను చూసి భయపడుతోందని, అందుకే తనను ఆ అంశంపై మాట్లాడనీయడం లేదని ఆరోపించారు.
తన ప్రశ్నలకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వలేక బెంబేలెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఖండించారు. రాహుల్‌గాంధీ పేర్కొంటున్న పుస్తకం ఇప్పటివరకు ప్రచురితం కాలేదని, అసలు ప్రచురితం కాని పుస్తకంలోని అంశాల గురించి సభలో ఎలా మాట్లాడతారని నిలదీశారు.
దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కేంద్ర మంతి అమిత్ షా మాట్లాడుతూ.. సభను అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. దేశ భద్రత వంటి సున్నితమైన అంశాలపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. జాతీయ భద్రత అంశాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకోవద్దని రాహుల్‌కు హితవు పలికారు.
ఈ అంశంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. వార్తా పత్రికల క్లిప్పింగులు, ప్రచురణ కాని పుస్తకాల్లోని అంశాలను సభలో ప్రస్తావించకూడదని హితవు పలికారు. అనంతరం ఆయన రూల్ బుక్ నియమాలను చదివి మరీ వినిపించారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌ను ‘దిద్దుబాటును నిరాకరించే బడ్జెట్’ అని అభివర్ణించారు.
దేశప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం అలసత్వం వల్ల దేశంలో తయారీ రంగం కుంటుపడిందని మండిపడ్డారు. రైతుల కష్టాలకు పరిష్కారం, నిత్యావసరాల తగ్గుదలపై బడ్జెట్‌లో ఎలాంటి ఊరట లేదని ధ్వజమెత్తారు. తర్వాత స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.
దేశాభివృద్ధికి దిక్సూచి కేంద్ర పద్దు: ప్రధానిమోదీ
ప్రధాని నరేంద్ర మోదీ బడ్జెట్‌ను దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపే దిక్సూచి అని అభివర్ణించారు. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాకు కొత్త జోష్ ఇస్తుందని ఆకాంక్షించారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబమని పేర్కొన్నారు.
బయో-ఫార్మా శక్తి, సెమీకండక్టర్ మిషన్ 2.౦ వంటి కొత్త పథకాల ద్వారా దేశీయ ఉత్పాదకత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగం బలోపేతానికి, మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు.