18-07-2025 12:09:07 AM
కాజీపేటలో రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీలు
కాజీపేట (మహబూబాబాద్) జూలై 17 (విజయక్రాంతి): కాజీపేట లో నూతనంగా ఏర్పాటు తలపెట్టిన రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, భద్రత ప్రమాణాలను, మార్గ నిర్దేశకాలను కచ్చితంగా అమలు చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ అధికారులను ఆదేశించారు. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనుల పురోగతిని గురువారం జిఎం పరిశీలించారు.
ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేశారు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో చేపట్టిన పనులను విభాగాల వారీగా పరిశీలించారు. పనుల పురోగతిపై ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులు జిఎంకు వివరించారు.
సికింద్రాబాద్ నుండి ప్రత్యేక రైలులో జనరల్ మేనేజర్ కాజీపేటకు వచ్చారు. మార్గమధ్యలో ఉన్న పలు స్టేషన్లను, సిగ్నలింగ్ వ్యవస్థ, రైల్వే ట్రాక్ పనితీరును రియర్ విండో ద్వారా పరిశీలించారు. యాదాద్రి, జనగామ రైల్వే స్టేషన్లను తనిఖీ చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించారు. అనంతరం కాజీపేటలో నూతనంగా ఏర్పాటుచేసిన రన్నింగ్ రూమును తనిఖీ చేసి లోకో పైలట్లకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కాజీపేటలోని లోకో రన్నింగ్ స్టాఫ్ లాబీని, రిలే గదిని పరిశీలించారు.
కాజీపేట రైల్వే స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. జిఎం రాక పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మొక్కను నాటారు. రైల్వే జీఎంను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సత్కరించి, ఈ ప్రాంత రైల్వే అభివృద్ధికి చేపట్టాల్సిన పనుల గురించి విజ్ఞాపన పత్రం అందజేసారు.