29 June, 2026 | 12:53 AM

రాష్ట్రంలో పలుచోట్ల వర్షం

29-06-2026 12:10 AM

ఆదిలాబాద్‌లో రైతుకూలీలకు తప్పిన ప్రమాదం

జగదేవపూర్/బెజ్జెంకి/ కొమురవెల్లి/ఆదిలాబాద్/ఉట్నూర్, జూన్ 28 (విజయక్రాంతి): సిద్ధిపేట, ఆదిలాబాద్‌లలో పలు చోట్ల ఆదివారం వర్షం కురిసింది. సిద్దిపేట, జగదేవపూర్, బెజ్జంకి, కొమురవెల్లి మండలాల పరిధిలో ఓ మోస్తారు వర్షం కురవగా, ఆదిలాబాద్ ఇంద్రవెల్లిలో వర్షంతోపాటు పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుతో ఒక ఎద్దు మృతిచెందగా, మరో ఎద్దుకు తీవ్ర గాయాలయ్యాయి. వ్యవసాయక్షేత్రంలో పొలం పనుల్లో ఉన్న రైతుకూలీలకు ప్రమాదం తప్పింది.

బెజ్జంకిలోని పలు గ్రామాలలో వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామాలలో వర్షం కురవాలంటూ గ్రామదేవతలకు పూజలు చేయడం, కప్పతల్లి ఆటలాడడం, వర్షం కోసం ఎదురుచూపులు వంటి దృశ్యాలే కనిపించాయి. ఆదిలాబాద్ ఇంద్రవెల్లిలో ఆత్రం భీంరావు అనే రైతు పంటచేనులో రెండోసారి పత్తి విత్తనాలను విత్తేందుకు వ్యవసాయ కూలీలతోపాటు ఎద్దులతో కలిసి పనులు నిర్వహిస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

దీంతో వ్యవసాయ కూలీలతోపాటు తాను కొద్ది దూరం వెళ్లారు. ఇంతలో పిడుగు పడింది. దీంతో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఒక ఎద్దు పిడుగుపాటుకు గురై మృతి చెందగా, మరో ఎద్దుకు తీవ్ర గాయాలయ్యాయి. రైతు భీంరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఎద్దులు లేకుండా వ్యవసాయ క్షేత్రంలో పనులు కుంటుపడతాయని భోరుమన్నాడు. ఐటీడీఏ అధికారులు స్పందించి తనకు ఎడ్లను కొనుగోలు చేసి ఇవ్వాలని వేడుకున్నాడు.