calender_icon.png 18 September, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్ష బీభత్సం.. స్తంభించిన రాకపోకలు

18-09-2025 07:28:43 PM

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పలు ప్రాంతల్లో గురువారం వర్షం(Hyderabad Rain) మరోసారి దంచికొట్టింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, కుషాయిగూడ, సైనిక్‌పురి, పాతబస్తీ, చంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బండ్లగూడ, ఎస్‌ఆర్‌ నగర్‌, బల్కంపేట, మెహదీపట్నం టోలీచౌకి, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి సహా పలు ప్రాంతాల్లో గంటపాటు భారీ వర్షం కురిసింది. నగరంలోని బహదూర్‌పురాలో 7.6 సెం.మీ, జూపార్క్ దగ్గర 6.9, రూప్‌లాల్‌ బజార్‌లో 6.9, నాంపల్లిలో 6.1, బండ్లగూడలో 5.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షంతో హైదరాబాద్‌ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ స్తంభించింది.

పంజాగుట్ట నుంచి మాదాపూర్‌ వరకు.. బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ వరకు.. మెహదీపట్నం నుంచి రాయదుర్గం వరకు.. సచివాలయం-ట్యాంక్‌బండ్‌ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ నెలకొంది. అలాగే చంద్రాయణగుట్ట, బండ్లగూడ, ఐఎస్‌ సదన్‌, షేక్‌పేట, రాయదుర్గం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలిలో భారీ ట్రాఫిక్‌ తో వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై ఎక్కడికక్కడే వర్షపు నీరు నిలిచిపోయింది. కాగా, ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Department) ప్రకటించింది.