22 July, 2026 | 2:04 AM

వరంగల్ ఏజెన్సీలో వర్షాలు

22-07-2026 12:11 AM
  1. బొగతకు జలకళ 
  2. కేటీపీపీలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం 
  3. వాజేడులో కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డు 

భూపాలపల్లి/ములుగు/మహబూబాబాద్, జూలై 21 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, వెంకటాపూర్ మండలాల్లో అత్యధికంగా 110 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ములుగు జిల్లాలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం బొగత జలపాతం వరద ఉధృతి పెరగడంతో పాల నురగవలె పొంగి ప్రవహిస్తూ పర్యాటకులకు ఆనందాన్ని కలిగిస్తోంది.

భూపాలపల్లి జిల్లాలో వర్షాలకు కాకతీయ థర్మల్ ప్రాజెక్ట్ ఓపెన్ కాస్ట్ 1,2 బొగ్గు గనుల్లో వర్షాలకు ఉత్పత్తికి కొంత అంతరాయం ఏర్పడింది. వాజేడు మండలంలో 163 జాతీయ రహదారి బ్రిడ్జి నిర్మాణం నేపథ్యంలో ఇసుక వాగు వద్ద నిర్మించిన తాత్కాలిక అప్రోచ్ రోడ్డు వరద ఉధృతికి మంగళవారం కొట్టుకుపోయింది.

దీంతో తెలంగాణ నుంచి చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు రాకపోకలు స్తంభించాయి. వాజేడు ఎస్సై సతీష్, ఎంపీడీవో కుమారస్వామి అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లాలోనీ ఏజెన్సీ మండలాలు బయ్యారం, గంగారం, కొత్తగూడ, గూడూరు మండలాల్లో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.