22 July, 2026 | 2:30 AM

ఒక కనెక్షన్.. బోలెడన్ని మోటార్లు..

22-07-2026 01:58 AM

నిలువునా విద్యుత్ చోరి..పట్టించుకోని అధికారులు..

సత్తుపల్లి, జూలై 21 (విజయ క్రాంతి): సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామంలో సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే పలుచోట్ల బోర్లు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలో ఒకే ప్రాంతంలో పక్కపక్కనే నాలుగు రిగ్ల ద్వారా బోర్లు వేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. బోర్లకు అవసరమైన అనుమతులు లేకుండానే విద్యుత్ సర్వీస్లు ఎలా మంజూరు అవుతున్నాయనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఒకే విద్యుత్ సర్వీస్ కనెక్ష్ప నాలుగు మోటార్లు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉండగా, ఇది విద్యుత్ నిబంధనలకు విరుద్ధమని స్థానికులు పేర్కొంటున్నారు.

అనుమతులు లేకుండా బోర్లు వేయడం, విద్యుత్ కనెక్షన్లలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై రెవెన్యూ, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని రైతులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విద్యుత్ కనెక్షన్లు, అక్రమ సర్వీస్లను తొలగించి రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే బోర్లకు అవసరమైన అనుమతులు రెవెన్యూ కార్యాలయంలో ఏ అధికారి ద్వారా మంజూరవుతున్నాయనే అంశంపైనా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.