22 July, 2026 | 1:42 AM

రైతులు ఆందోళన పడొద్దు

22-07-2026 12:19 AM
  1. ఎల్ నినోపై ఎప్పటికప్పుడు సమీక్షస్తున్నాం
  2. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 
  3. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
  4. మంత్రి పొన్నం ప్రభాకర్ 
  5. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితులపై సమీక్ష

హనుమకొండ/మహబూబాబాద్, జూలై 21 (విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పరిస్థితులపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షితోందని, రైతులు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వరి పంటకు బదులు ఆరు తడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రానున్న రోజుల్లో అనుసరించాల్సిన పరిస్థితులపై మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లో మంగళవారం ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిని దేవసేన అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు.

వర్షాభావ పరిస్థితులపై సమగ్రంగా చర్చించామని, వర్షాభావ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు. జిల్లాల్లో వ్యవసాయం, తాగునీటి లభ్యత, భూగర్భ జలాలు, వర్షాభావ పరిస్థితులు తదితర అంశాలపై ప్రత్యేక అధికారులు నివేదికలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గానికి అందజేస్తారన్నారు.

వర్షాభావ పరిస్థితుల నుంచి జిల్లాలను ఎలా గట్టెక్కించాలి, రైతులకు ఎలాంటి భరోసా కల్పించాలి, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. ప్రజలు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి పంటకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను సన్నద్ధం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతుల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో పశువుల సంరక్షణ ఎంతో కీలకమని, వాటికి నీరు, మేత కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు. విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పైస్థాయి అధికారుల నుండి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటో త్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, కెఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్లు, చాహత్ బాజ్ పాయ్, డాక్టర్ సత్య శారద, స్నేహ శబరిష్, భోర్కడే హేమంత్ సహదేవరావు, సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు.