వర్షపు నీటిని ఒడిసి పట్టాలి
- భూగర్భ జలాలను పెంచడమే ‘జలసిరి’ లక్ష్యం.
- ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
- రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.
ములుగు, జూలై 28 (విజయక్రాంతి): వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడమే ‘జలసిరి’ కార్యక్రమ ముఖ్య లక్ష్యమని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
మంగళవారం ములుగు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ములుగు మండల సర్వసభ్య సమావేశంతో పాటు జలసిరి అవగాహన సదస్సుకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, గ్రామాల సమస్యలను మండల స్థాయిలో చర్చించి వెంటనే పరిష్కరించేందుకు మండల సర్వసభ్య సమావేశాలు సమర్థవంతమైన వేదికగా నిలుస్తాయన్నారు.
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం జలసిరి కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ‘ఇంటింటికి ఇంకుడు గుంత, ఊరి కోసం ఊటకుంట’ పంట కోసం పంటకుంట అనే నినాదంతో ప్రతి గ్రామంలో వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేలా విస్తృతంగా పనులు చేపట్టాలని సూచించారు. నీటి ఎద్దడిని తగ్గించేందుకు జలసిరి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ మన ఇంటి సిరిగా భావించి భాగస్వాములు కావాలని కోరారు.
రాబోయే రెండు రోజుల్లో గ్రామసభలు నిర్వహించి, ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గ్రామస్థాయిలోనే తీర్మానించుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతుల పొలాల్లో వ్యక్తిగత ఆస్తుల అభివృద్ధి పనులు, పశువుల పాకలు, మిల్క్ షెడ్లు, పంటకుంటల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అవసరానికి మించి నీటిని వినియోగించకుండా, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎం. సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, ఆత్మ కమిటీ ఛైర్మన్ రవీందర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి కొమురయ్య, ఎంపీడీవో సందీప్, రహీంవివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






