14-01-2026 12:11:41 AM
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
చండూరు, జనవరి 13 (విజయక్రాంతి): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యేకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని, ఈ ప్రాంతానికి చేసింది అభివృద్ధి శూన్యమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు.తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు చేతిలో నడుస్తుందని, ఒక నాయకుడు చంద్రబాబు అయితే మరొకడు మోడీ అయ్యాడని, ఇరువురి కనుసన్నలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సాగునీటిపై రోడ్లపై ఎలాంటి అవగాహన లేదని, మంత్రి పదవి పైన ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదన్నారు.
మంత్రి పదవి వచ్చేది తెలవదు కానీ నిత్యం మంత్రి పదవి నామస్మరణంతో నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలోనే చండూరు,చౌటుప్పల్ మండలాలను మున్సిపాలిటీలతో పాటు రెవిన్యూ డివిజన్ గా మార్చిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీకే దక్కిందన్నారు. రాజగోపాల్ రెడ్డి 14 సంవత్సరాలుగా ప్రజా ప్రతినిధిగా ఉండి ఏ ఒక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేదని, చేసిన పనులకు బిల్లులు ఇచ్చే దిక్కు లేదు కానీ రానున్న రెండు సంవత్సరాలలో అభివృద్ధి చేస్తామనడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ఇంజనీర్లు తయారుచేసిన డిపిఆర్ ఆమోదిస్తే, మునుగోడు ప్రాంతంలోని శివన్న గూడెం, కిష్టరాంపల్లి ప్రాజెక్ట్ నక్కల గండికి నీళ్లు రావడంతో నల్లగొండ జిల్లా సస్యశ్యా మలం అయ్యేదన్నారు.
కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం సమగ్ర విషయాలతో సుప్రీంకోర్టుకు వెళ్లకుండా అవగాహన తప్పుడు సమాచారం ఇస్తే సుప్రీంకోర్టు తిరస్కరించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మునగాల నారాయణరావు, ఎత్తపు మధుసూదన్ రావు, చండూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుర్రం మాధవి వెంకటరెడ్డి, మున్సిపల్ మాజీచైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మర బోయిన వెంకన్న, కోడి వెంకన్న,మాజీ కౌన్సిలర్ అన్నేపర్తి శేఖర్, గుంటి వెంకటేశం, బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్త పాటి సతీష్, అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, యువజన అధ్యక్షులు ఉజ్జిని అనిల్ రావు, బీఆర్‌ఎస్ మండల నాయకులు రావిరాల నగేష్, ఇరిగి రామన్న, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.