14-01-2026 12:09:45 AM
పచ్చదనంపై పెను చిచ్చు
విచ్చలవిడిగా బొగ్గుబట్టీల నిర్వహణ
జనావాసాలలోనే ఏర్పాటు
అనారోగ్యాలకు గురి అవుతున్న ప్రజలు
చర్యలు తీసుకోవాలని వేడుకోలు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి13: వృక్షో రక్షతి రక్షితః అనే నానుడిను ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరు గతంలో చెట్లు నాటి బాధ్యతగా వాటిని పెంచడంతో పచ్చదనంతో నిండిన పల్లెలన్నీ అందాల సిరిమల్లెలుగా మారిపోయాయి. కానీ నేడు దానికి విరుద్ధంగా ధనార్జనే ధ్యేయంగా కొందరు బొగ్గుబట్టీలు నిర్వహిస్తూ పచ్చని కలపను బొగ్గుగా మారుస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. పచ్చదనంతో కళాకళలాడాల్సిన పల్లెలు నేడు మసిబారుతున్నాయి. ప్రభుత్వం హరితహారం పథకంలో మొక్కలు విరివిగా పెంచి పర్యావరణాన్ని కాపాడాలని ప్రచారం చేస్తూ మొక్కలు నాటుతూ వాటిని రక్షిస్తుంటే వ్యాపారులు ఎక్కడపడితే అక్కడ పచ్చని చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా నరికిస్తున్నారు.
గ్రామానికి దూరంగా ఉండాల్సిన బొగ్గుబట్టీలు జనావాసాలకు సమీపంలో నిర్వహిస్తుండడంతో పొగ వ్యాపించి, వాయు కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. మండలంలో జాజిరెడ్డిగూడెం, కొమ్మాల, కోడూరు, లోయపల్లి, పడమటితండా, వీర్యనాయక్ తండ, నాణ్యతండాల్లో 20కి పైగా బొగ్గుబట్టీలు నిర్వహిస్తున్నారు. వీర్యానాయక్ తండాలో జనావాసాల సమీపంలో బట్టీలు పెట్టడంతో పొగ వ్యాపించి బాటసారులు, వాహన చోదకులు నానా అవస్థలు పడుతున్నారు. చాలావరకు నిబంధనల ప్రకారం అనుమతులు లేనివేనని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా బట్టీలు పెడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.
నేల వాలుతున్న పచ్చని చెట్లు
ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి మొక్కలు పెంచుతుంది. పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో పలు పథకాలను చేపట్టింది. అయితే అక్రమార్కులు ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తూ చెట్లను నరికి బొగ్గును తయారుచేసి కర్ణాటకలోని బెంగుళూరు తదితర ప్రాంతాలకు లారీల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పూర్తిగా పర్యవేక్షణ చేసి కలప అక్రమ రవాణా, బొగ్గుబట్టీల అక్రమ నిర్వహణపై దృష్టి సారించి పర్యావరణాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి
చెట్లను నరకడం, వాటిని రవాణా చేయడంలో నిబంధనలు పాటించడం లేదు. నిత్యం మండలం నుంచి లారీలు, ట్రాక్టర్లలో వేప, తుమ్మ, చింత తదితర చెట్ల కర్రల లోడ్లు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్న పట్టించుకునే నాధుడే లేడు. గ్రామాల్లో బొగ్గుబట్టీలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. బట్టీలు ఎక్కువ కావడంతో గ్రామాల్లో పచ్చదనం కరువవుతుంది. అధికారులు చర్యలు తీసుకొని బొగ్గుబట్టీలు పూర్తిగా నిషేధించాలి.
- ఖమ్మంపాటి జగన్, సామాజిక కార్యకర్త, వేల్పుచర్ల