calender_icon.png 13 September, 2024 | 12:14 AM

సెప్టెంబర్ 3న రాజ్యసభ ఎన్నికలు

08-08-2024 12:16:07 AM

  1. 12 స్థానాలకు ఈసీ షెడ్యూల్ ప్రకటన
  2. ఈ నెల 14న ఎన్నికల నోటిఫికేషన్
  3. 21వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు
  4. సెప్టెంబర్ 3వ తేదీనే ఫలితాల ప్రకటన

న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): పార్లమెంటులోని పెద్దల సభలో ఖాళీ అయిన 12 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించింది. వచ్చేనెల 3న ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించ నున్నారు. ఈ నెల 14వ తేదీన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపింది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26 లేదా 27న నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ ఉంటుంది. సెప్టెంబర్ 3న ప్రతి స్థానానికి విడిగా ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారు. 

9 రాష్ట్రాలు.. 12 ఖాళీలు

9 రాష్ట్రాలకు చెందిన 12 సీట్లకు ఎన్నికలు జరునున్నాయి. అందులో తెలంగాణకు చెందిన ఒక స్థానం కూడా ఉన్నది. ఎంపీ కే కేశవరావు ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మిగిలిన స్థానాల్లో ఎక్కువగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచినవారి తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసినవే అధికంగా ఉన్నాయి. కేంద్ర మంత్రులు పీయూష్‌గో యల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాధిత్య సింథియా లోక్‌సభకు ఎన్నికైన తర్వాత రాజ్యసభ సభ్యత్వాలను వదులుకొన్నారు. మొత్తంగా అస్సాం, బీహార్, మహారాష్ట్రలో రెండుచొప్పు, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, తెలంగాణ, ఒడిశాలో ఒకటి చొప్పున రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి.  

ఢిల్లీ నేతకే అవకాశం? 

రెండేళ్ల పదవీ కాలం ఉండగానే కేకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో.. ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ ఎంపీగా గెలిచిన కేశవరావు.. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో.. రాజ్యసభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమే. అయితే పార్టీ అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ సీనియర్ నేత సల్మాన్‌ఖుర్షీద్‌ను తెలంగాణ నుంచి బరిలోకి దించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం.