2 April, 2026 | 3:35 AM

దంచికొట్టిన రిజ్వి

02-04-2026 01:40 AM

ఐపీఎల్ ఢిల్లీ బోణి

లక్నో సూపర్‌జెయింట్స్‌పై విజయం

హాఫ్ సెంచరీతో గెలిపించిన రిజ్వి

భారీస్కోరు చేస్తుందనుకున్న లక్నో సూపర్‌జెయింట్స్‌ను 141 పరుగులకే ఆలౌట్ చేశారు...కానీ ఛేజింగ్‌లో ట్విస్ట్... కీలక బ్యాటర్ల వైఫల్యం.. ఫలితంగా 26 పరుగులకే నాలుగు వికెట్లు డౌన్.. మ్యాచ్ గెలవడం కష్టమే అనుకున్న దశలో యువ క్రికెటర్ సమీర్ రిజ్వీ ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. 

లక్నో, ఏప్రిల్ 1 : ఐపీఎల్ 19వ సీజన్ లో ఢిల్లీ బోణీ కొట్టింది. ఉత్కంఠగా సాగిన పోరులో లక్నోను ఓడించి సీజన్ ను ఘనంగా ఆరంభించింది. సమీర్ రిజ్వీ ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. పంత్, మార్ష్ ఇన్నింగ్స్ ఆరంభించగా అనుకున్నంత దూకుడుగా ఆడలేకపోయారు.  కాసేపు ఢిల్లీ బౌలర్లపై ఆధిపత్యం కనబరిచిన మిఛెల్ మార్ష్  28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసి ఐదో వికెట్ గా వెనుదిరిగాడు.

ఇక్కడ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. ఈ దశలో అబ్దుల్ సమద్ టెయిలెండర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. స్కోరు పెంచే బాధ్యత తీసుకున్న సమద్ ఆరో వికెట్ కు ముకుల్ చౌదరీతో కలిసి 34 పరుగులు జోడించాడు.అలాగే షాబాజ్ అహ్మద్ తో కలిసి ఏడో వికెట్ కు 33 పరుగులు జోడించాడు. అయితే చివరి ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు మరోసారి అద్ఙుతంగా బౌలింగ్ చేశారు. పేసర్లు ఎంగిడి, నటరాజన్ తో పాటు స్పిన్నర్ కులదీప్ యాదవ్ కీలక సమయాల్లో వికెట్లు తీసారు.

ఫలితంగా లక్నో సూపర్ జెయింట్స్ పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. అబ్దుల్ సమద్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 35 పరుగులు చేయగా..ముకుల్ చౌదరి 14 , షాబాద్ అహ్మద్ 15 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో ఎంగిడి 3 , నటరాజన్ 3 , కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. 142  పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కేఎల్ రాహుల్ తొలి బంతికే డకౌట్ గా వెనుదిరిగాడు. కాసేపటికే నిస్సాంక (1), నితీష్ రాణా(15) , అక్షర్ పటేల్ (0) ఔటయ్యారు.

రాహుల్ ను మహ్మద్ షమీ పెవిలియన్ కు పంపితే..  నిస్సాంక, అక్షర్ పటేల్ ను ప్రిన్స్ యాదవ్ ఔట్ చేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లక్నో బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సమీర్ రిజ్వి, స్టబ్స్ తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆరంభంలో 13 బంతుల్లో కేవలం 5 పరుగులే చేసిన రిజ్వితర్వాత రెచ్చిపోయాడు.

వరుసగా బౌండరీలు, డబుల్స్ తీస్తూ స్కోర్ పెంచాడు. అటు స్టబ్స్ కూడా దూకుడుగా ఆడడంతో ఢిల్లీ మ్యాచ్ పై పట్టుబిగించింది. వీరిద్దరూ ఐదో వికెట్ కు అజేయంగా 119 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రిజ్వి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడిన ఈ యువ ఆటగాడు మ్యాచ్ ను త్వరగానే ముగించేశాడు. అసలు గెలుస్తుందా లేదా అనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ రిజ్వీ  ధనాధన్ బ్యాటింగ్ తో మరో 17 బంతులు మిగిలుండగానే టార్గెట్ ను అందుకుంది. రిజ్వీ 70 పరుగులతోనూ, స్టబ్స్ 39 రన్స్ తోనూ నాటౌట్ గా నిలిచారు.

స్కోరు బోర్డు

లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్ : 141 ఆలౌట్ ( మార్ష్ 35, అబ్దుల్ సమద్ 36, షాబాజ్ అహ్మద్ 15 ; ఎంగిడి 3/27 , నటరాజన్ 3/29 , కుల్దీప్ యాదవ్ 2/31 )

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : 145/4 (17.1 ఓవర్లు) ( సమీర్ రిజ్వి 70 నాటౌట్, స్టబ్స్ 39 నాటౌట్, రాణా 15 ; ప్రిన్స్ యాదవ్ 2/20, షమీ 1/28 )