2 April, 2026 | 2:55 AM

ఎల్లంపల్లికి గ్రహణం!

02-04-2026 12:55 AM

గోదావరి జలాల వినియోగంలో తెలంగాణకు జీవనాడి

శ్రీపాదరావు పేరుపెట్టి కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యం

  1. గోదావరి ఫేజ్-2, ఫేజ్-3 పనులు పూర్తికాక సామర్థ్యం తగ్గుదల
  2. సవాళ్లను అధిగమిస్తేనే సమృద్ధిగా నీరు
  3. ప్రాజెక్ట్‌కు సమగ్ర ప్రణాళిక అవసరమంటున్న నిపుణులు

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): తెలంగాణలో గోదావరి జలాలను వినియోగంలోకి తీసుకురావడంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుది కీలక పాత్ర. సుమారు రూ. 5 వేల కోట్ల వ్యయంతో తెలంగాణకు జీవనాడిగా నిలిచేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పలు సమస్యలతో పూర్తి సామర్థ్యాన్ని అందించలేకపోతున్నది. నీటి స్థాయిల అస్థిరత, లిఫ్ట్ ఇరిగేషన్‌పై అధికంగా ఆధారపడ టం, విద్యుత్ ఖర్చుల పెరుగుదల వంటి సాంకేతిక సమస్యలు ప్రాజెక్టు నిర్వహణను భారంగా మార్చాయి.

మరోవైపు గోదావరిపై ఫేజ్-2, ఫేజ్-3 ప్రాజెక్టుల పనులు జాప్యం అవుతుండటంతో ఆశించిన స్థాయిలో నీటిని వినియోగించుకోవ డంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతోపాటు నిర్వాసితుల పరిహారం సమస్య ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాకపోవడం స్థానికంగా అసంతృప్తికి దారితీస్తోంది. కోర్టుల్లో కేసులు కొనసాగుతుండటంతో ఈ అంశం రాజకీ యంగా కూడా వేడెక్కింది.

పెరుగుతున్న తాగునీటి, పరిశ్రమల అవసరాలు ఈ ప్రాజెక్టుపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. ఒకే ప్రాజెక్టుపై అధికంగా ఆధారపడటంతో నీటి నిర్వహణలో సవాళ్లు మరింత తీవ్రంగా మారుతున్నా యి. అన్ని రంగాలకు కీలకమైన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతం పలు సమస్యలతో గ్రహణం పట్టినట్టుగా ఉంది.  

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ రాష్ట్రంలోని సాగు, తాగునీరు, పరిశ్రమల అవసరాలకు ప్రధాన ఆధారంగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టు సుమారు రూ. 5,000 కోట్లకుపైగా ఖర్చుతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. మంచిర్యాల-పెద్దపల్లి జిల్లాల సరిహద్దులో 2004లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, 2016లో తుదిరూపు దాల్చింది. అప్పటినుంచి ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలకంగా మారింది.

సుమారు 20 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఉన్న ఈ ప్రాజెక్ట్ ద్వారా రామగుండం, గోదావరిఖని ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌కు కూడా తాగునీటి సరఫరా జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 30,000 ఎకరాలకు పైగా భూమి సేకరించగా, 20 వేలకుపైగా ప్రజలు నిర్వాసితులయ్యారని అంచనా ఉంది. అయితే పరిహారం, పునరావాస అంశాలు ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంకా కొన్ని వందల కోట్ల రూపాయల పరిహారం పెండింగ్‌లో ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. కొంతమంది బాధితులు న్యాయపోరాటం కొనసాగిస్తుండటం కూడా ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ప్రారంభ దశలోనే ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అనేక అడ్డంకుల వల్ల పనులు మందగించాయి. ముఖ్యంగా భూసేకరణ సమస్యతోపాటు నిధుల కొరత కూడా ప్రధాన సమస్యగా మారింది. ప్రాజెక్ట్ అంచనా వ్యయం క్రమంగా పెరగడం, అవసరమైన నిధులు సమయానికి అందకపోవ డం వల్ల నిర్మాణం ఆలస్యమైంది.

ప్రభుత్వం దశలవారీగా నిధులు విడుదల చేయడంతో పనులు కూడా దశలవారీగా కొనసాగాల్సి వచ్చింది. సాంకేతిక సమస్యలు కూడా ప్రాజెక్ట్ పనులను ప్రభావితం చేశాయి. గోదావరి నదిపై భారీ నిర్మాణం కావడంతో ఇంజనీరింగ్ సవాళ్లు ఎదురయ్యాయి. వరదల సమయంలో పనులు నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో పనులు మరింత ఆలస్యమయ్యాయి. ఇక పరిపాలనా మార్పులు కూడా ప్రభావం చూపాయి.

రాష్ట్ర విభజనకు ముందు, తరువాత జరిగిన విధాన మార్పులు, ప్రాధాన్యతల్లో మార్పులు ప్రాజెక్ట్ పురోగతిపై ప్రభావం చూపినట్లు నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టులకు ప్రాధాన్యం పెరగడం వల్ల ఎల్లంపల్లి పనులు కొంతకాలం నెమ్మదించాయి. అయితే ప్రస్తుతం సమస్యలన్నీ పూర్తి పరిష్కారం అయితేనే దీని పూర్తి ప్రయోజనం ప్రజలకు అందుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సవాళ్లను అధిగమిస్తేనే..

రాష్ట్రంలోని సాగు, తాగునీరు, పరిశ్రమల అవసరాలకు ప్రధాన ఆధారంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ పరిస్థితిపై ప్రభుత్వంతో పాటు ప్రజల దృష్టి నిలిచింది. ప్రస్తుతం ఎండాకాలం ప్రభావంతో ప్రాజెక్ట్‌లో నీటి మట్టం క్రమంగా తగ్గుతున్నప్పటికీ, అవసరాల మేరకు సరఫరా కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు తాగునీరు, రామగుండం పరిశ్రమలకు అవసరమైన నీటిని ప్రాజెక్ట్ నుంచి పంపిస్తున్నారు.

అయితే, సీజన్‌ను బట్టి నీటి లభ్యత మారుతూ ఉండటంతో ప్రణాళికాబద్ధ వినియోగం అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దాదాపు పూర్తి స్థాయికి చేరుకొని గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేయడం గమనార్హం. దీంతో సాగునీటి ఆశలు పెరిగినా, ప్రస్తుతం నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఎండాకాలంలో నీటి నిర్వహణ కీలకంగా మారింది.

ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా లిఫ్ట్ ఇరిగేషన్‌పై ఆధారపడటం మరో పెద్ద సమస్యగా మారింది. నీటిని ఎత్తిపంపేందుకు భారీ విద్యుత్ అవసరం ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతున్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే నీటి పంపిణీ కూడా నిలిచిపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. సాగునీటి పంపిణీ విషయంలో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాలువల ద్వారా నీరు సమానంగా చేరడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

కొంతమంది రైతులకు మాత్రమే ప్రయోజనం కలుగుతుండగా, ఇతర ప్రాంతాలు నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. దీనికితోడు గోదావరి ఫేజ్- ఫేజ్ వంటి అనుబంధ ప్రాజెక్టులు ఇంకా పూర్తికాకపోవడం వల్ల ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం వినియోగంలోకి రావడం లేదు. ఈ పనులు పూర్తయితే మరింత ప్రాంతాలకు నీటి సరఫరా విస్తరించే అవకాశం ఉన్నప్పటికీ, ఆలస్యం కారణంగా ప్రయోజనం తగ్గుతోంది.

మొత్తం మీద, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటి వనరుగా ఉన్న ప్రాధాన్యాన్ని నిలుపుకుంటూనే, పలు సమస్యలతో సవాళ్లను ఎదుర్కొంటోంది. సరైన ప్రణాళిక, సమర్థ నిర్వహణ, మరియు నిర్వాసితుల సమస్యల పరిష్కారం జరిగితేనే ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంది.

శ్రీపాదరావు నామకరణం చారిత్రక ఘట్టం

గోదావరి నదిపై నిర్మితమైన ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు అధికారికంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనే పేరు పెట్టడం వెనుక చారిత్రక నేపథ్యం ఉంది. ప్రజా నాయకుడు దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలకు గుర్తింపుగా, ఆయనకు గౌరవ సూచకంగా ఈ ప్రాజెక్ట్‌కు శ్రీపాద అనే పేరుపెట్టారు. ప్రజాసేవలో శ్రీపాద రావుది  కీలకపాత్ర. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు ఆయన పేరు పెట్టింది.

ఎల్లంపల్లి ప్రాజె క్ట్ నిర్మాణం ప్రారంభ దశలో ఇది కేవ లం ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌గానే ఉన్నప్పటికీ తరువాత ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజల సూచనలతో దీనికి శ్రీపాద అనే పేరు జోడించి నామకరణం చేశారు. దీనితో ప్రాంతీయ నాయకుల సేవలను గుర్తిం చినట్లయింది.

అయితే శ్రీపాదరావు సేవలకు గుర్తింపుగా ఆయన పేరు పెట్టినప్పటికీ, అధికారికంగా ప్రారంభానికి నోచుకోక.. ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతూనే ఉంది. గొప్ప నాయకుడి పేరు పెట్టి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు కోరుతున్నారు.

సమగ్ర ప్రణాళిక అవసరం.. 

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేర ప్రాధాన్యమిస్తుందనే ప్రశ్న ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో వినిపిస్తుంది. హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా, రామగుండం పరిశ్రమలకు నీటి అందుబాటు, గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు లింక్‌గా దీనిని అభివృద్ధి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గోదావరి ఫేజ్--2, ఫేజ్--3 పనుల ద్వారా మరింత ప్రాంతాలకు నీటిని అందించే ప్రణాళికలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది.

ప్రతిపక్షాలు మాత్రం ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యాన్ని ప్రభుత్వం వినియోగించలేకపోతుందనే ఆరోపిస్తున్నాయి. ఇదిలాఉండగా ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సాగు, తాగునీరు, పరిశ్రమల అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, దీని వినియోగంలో ఉన్న లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో నీరు సమృద్ధిగా ఉన్నా, ఎండాకాలంలో సరఫరా నిర్వహణలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది ప్రాజెక్ట్ నిర్వహణలో దీర్ఘకాలిక ప్రణాళిక లోపాన్ని సూచిస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను కేవలం నిల్వ కేంద్రంగా కాకుండా నీటి నిర్వహణ కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. నీటి నిల్వ, వినియోగం, పంపిణీ అన్నింటికీ ఒక సమగ్ర వ్యూహం అవసరమని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా సాగునీటి పంపిణీలో సమానత్వం, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం, పరిశ్రమల వినియోగానికి పరిమితులు వంటి అంశాలను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది.

ఇక గోదావరి ఫేజ్-2, ఫేజ్-3 వంటి అనుబంధ ప్రాజెక్టుల పూర్తి కూడా కీలక అంశంగా మారింది. ఈ ప్రాజెక్టులు సమయానికి పూర్తికాకపోతే ఎల్లంపల్లి సామర్థ్యం పూర్తిగా వినియోగంలోకి రావడం కష్టమవుతుంది. అందుకే సమగ్ర ప్రణాళికతో ఈ పనులకు వేగం పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

పలు సమస్యలు.. పరిష్కారాలు

* ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ప్రస్తుతం నీటి స్థాయిల అస్థిరత సమస్యను ఎదుర్కొంటోంది. గోదావరి జలాలపై ఆధా రపడిన ఈ ప్రాజెక్ట్‌లో నీటి నిల్వలు పూర్తిగా వర్షాలపై ఆధారపడటం ప్రధాన సవాలుగా మారింది. వర్షాకాలంలో గోదావరిలో వరదలు రావడం తో ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నిల్వకు చేరుకుంటుంది. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే, అదే ప్రాజెక్ట్ ఎండాకాలానికి చేరుకునే సరికి పూర్తిగా భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.

వర్షాలలేమి తో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడం సాధారణంగా మారింది. ఈ పరిస్థితి సాగునీటి సరఫరాపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. రైతులు పంటల కోసం నిరంతర నీటి సరఫరా ఆశించినప్పటికీ, నీటి స్థాయిల మార్పులతో ఆ ఆశలు దెబ్బతింటున్నాయి. అలాగే తాగునీటి సరఫరా విషయంలో కూడా అనిశ్చితి నెలకొంటోంది.

ముఖ్యంగా ఎండాకాలంలో నగరాలు, గ్రామాల్లో నీటి వినియోగంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ సమ స్యను అధిగమించాలంటే నీటి నిల్వలను సంవత్సరం పొడవునా సమర్థంగా నిర్వహించే విధానాలు అవసరం. వర్షాకాలంలో నిల్వ అయిన నీటిని ఎండాకాలానికి సరిపడేలా ప్రణాళికాబద్ధంగా వినియోగించాల్సిన అవసరం ఉంది.

* లిఫ్ట్ ఇరిగేషన్ విధానంపై అధిక ఆధారపడటంతో ప్రాజెక్ట్ నిర్వహణపై భారీ ఆర్థిక భారం పడుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా నీటిని ఎత్తున ప్రాంతాలకు పంపించాలంటే భారీ విద్యుత్ అవసరం అవుతుంది. ఈ ప్రక్రియలో రోజువారీగా పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగం జరుగుతోంది. దీంతో విద్యుత్ ఖర్చులు గణనీయంగా పెరిగి, ప్రాజెక్ట్ నిర్వహణ వ్యయం అధికమవుతోంది. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం వచ్చినా నీటి పంపిణీ పూర్తిగా నిలిచిపోవడం మరో సమస్య.

ఇది ముఖ్యంగా సాగునీటి సరఫరాపై ప్రభావం చూపుతోంది. రైతులు నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతుండటంతో అసంతృప్తి పెరుగుతోంది. లిఫ్ట్ ఇరిగేషన్‌పై పూర్తిగా ఆధారపడటం కంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం అవసరం. విద్యుత్ వినియోగాన్ని తగ్గించే సాంకేతిక పరిజ్ఞానాలు, సౌర శక్తి వినియోగం వంటి మార్గాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 

* అభివృద్ధి కోసం నిర్మించిన ఈ ప్రాజె క్ట్, భూములు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం జరిగిందా అనే ప్రశ్న తెర మీదకు వస్తుంది. ప్రాజెక్ట్ నిర్మా ణం వల్ల తమ భూములు కోల్పోయిన అనేక కుటుంబాలు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా భూమి విలువ, జీవనోపాధి కోల్పోవడంపై సరైన పరిహారం లభించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పునరావాసం విషయంలో కూడా అసంతృప్తి వ్యక్తమవు తోంది.

ఈ అంశంపై పలువురు బాధితులు కోర్టులను ఆశ్రయించడం పరిస్థి తిని మరింత సున్నితంగా మార్చింది. పరిహారం, పునరావాసంపై న్యాయపోరాటం కొనసాగుతుండటంతో ఈ సమస్యకు త్వరిత పరిష్కారం అవసరం అనే అభిప్రాయం బలపడుతోంది. రాజకీయంగా కూడా ఈ అంశం వేడెక్కుతోంది. ప్రతిపక్షాలు నిర్వాసితుల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా, ప్రభుత్వం మాత్రం పరిహారం ప్రక్రియ కొనసాగుతోందని చెబుతోంది. ఈ నేపథ్యంలో సరైన పరిష్కారం లేకపోతే ఈ అంశం మరింత వివాదానికి దారితీసే అవకాశం ఉంది.

* ముఖ్యంగా గోదావరి ఫేజ్-2, ఫేజ్-3 పనులు పూర్తికాకపోవడం వల్ల ప్రాజెక్ట్ పూర్తి ప్రయోజనం ప్రజలకు చేరడం లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను కేవలం నిల్వ కేంద్రంగా కాకుండా, ఇతర ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే లింక్‌గా రూపుదిద్దారు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించడంలో కీలకమైన అనుబంధ ప్రాజెక్టులు సమయానికి పూర్తికాకపోవడం వల్ల నీటి పంపిణీ వ్యవస్థలో లోపాలు కనిపిస్తున్నాయి.

గోదావరి ఫేజ్- ఫేజ్- ప్రాజెక్టుల ద్వారా నీటిని మరింత ఎత్తున ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు ఎత్తిపంపే ప్రణాళికలు ఉన్నప్పటికీ, పనులు నెమ్మదిగా సాగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఎల్లంపల్లిలో నిల్వ ఉన్న నీరు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకుండా నిలిచిపోతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనుబంధ ప్రాజెక్టులు సమయానికి పూర్తుతైనే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం వినియోగంలోకి వస్తుంది. లేదంటే ఈ ప్రాజెక్ట్ ఒక పరిమిత ప్రయోజనంతోనే కొనసాగిపోతుందని నిపుణుల హెచ్చరిస్తున్నారు.

* తెలంగాణలో నీటి అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌పై ఒత్తిడి కూడా గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యం గా పట్టణీకరణ, పరిశ్రమల విస్తరణతో ఈ ప్రాజెక్ట్పై ఆధారపడే రంగాలు విస్తరిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి తాగునీటి అవసరం నిరంతరం పెరుగుతోంది. జనాభా పెరుగుదల, నగర విస్తరణ కారణంగా రోజువారీ నీటి వినియోగం అధికమవుతోంది. ఈ అవసరాలను తీర్చడంలో ఎల్లంపల్లి కీలక వనరుగా మారింది.

పరిశ్రమల రంగంలో కూడా నీటి అవసరం వేగంగా పెరుగుతోంది. రామగుండం పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యుత్, ఇతర పరిశ్రమలకు నిరంతర నీటి సరఫరా అవసరం అవుతోంది. పరిశ్రమల విస్తరణతో ఈ అవసరం మరింత పెరుగుతున్నది. ఈ ఒత్తిడిని తగ్గించాలంటే ప్రత్యామ్నాయ నీటి వనరులను అభివృద్ధి చేయడం అవసరం. ఇతర ప్రాజెక్టులను బలోపేతం చేయడం, నీటి సంరక్షణ చర్యలను పెంచడం ద్వారా ఎల్లంపల్లిపై ఉన్న ఒత్తిడిని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.