స్థాయి మరచి వ్యక్తిగత, అసత్య ఆరోపణలు చేస్తే సహించము
కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకుల హెచ్చరిక
కోదాడ,(విజయక్రాంతి): స్థాయి మరచి వ్యక్తిగత, అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. శుక్రవారం కోదాడ పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ యాదవ నాయకులు మాట్లాడుతూ వార్డు సభ్యుడిగా గెలవలేని వ్యక్తి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేయడం విచారకరం అన్నారు. తన స్థాయి మరచి మంత్రి, ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. వ్యక్తిగతంగా పూజలు చేసుకుంటే సీఎం పదవి కోసం క్షుద్ర పూజలు అంటూ ఆరోపించడం ఏమిటి అని ప్రశ్నించారు. తనకు ఓటు వేయలేదనే కారణంతో తోటి యాదవులపై విమర్శలు చేయడం అవివేకం అన్నారు.
అభివృద్ధి పనుల్లో తేడా ఉన్నా, ప్రజలు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నా స్వేచ్ఛగా ప్రశ్నించే అవకాశం అందరికీ ఉందన్నారు. గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హయాంలో మట్టి దందా, ఇసుక దందా, ఇలా ప్రతి పనిలో అవినీతి జరిగిందని, ప్రజలకు విసుగొచ్చి భారీ మెజార్టీతో ఓడించిన విషయం మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇకముందు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిపై వ్యక్తిగత, అసత్య ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఈ విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ యాదవ నాయకులు ఈదుల కృష్ణయ్య, కట్టెబోయిన శ్రీనివాస్, గుండెల సూర్యనారాయణ, సైదిబాబు, పాశం శ్రీనివాసరావు, చీదెళ్ళ హనుమంతరావు, కోట హరీష్, యలగాల శ్రీను, చింతలపాటి సతీష్ పాల్గొన్నారు.






