27 August, 2026 | 4:40 AM

భూభారతి పేరుతో రియల్ దందా

27-08-2026 01:37 AM
  1. 22 ఏ స్కాంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి 
  2. నిషేధిత భూములను వెంటనే ఫ్రీ హోల్డ్ చేయాలి
  3. బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): భూభారతి(Bhu-Bharat) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) రియల్ ఎస్టేట్(real estate) దందా చేస్తోందని, 22 ఏ నిషేధిత భూముల కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు(N Ramchander Rao) డిమాండ్ చేశారు. ప్రభుత్వం పాలన గాలికొదిలేసి ప్రజల భూములను వేలంవేస్తూ ఖజానా నింపుకుంటుందని విమర్శించారు.

హైదరాబాద్‌(Hyderabad)లోని కూకట్‌పల్లి, ఆరుట్ల గ్రామాలతో పాటు శివారు ప్రాంతాల్లో 60--70 శాతం ప్రజలు 22 ఏ బాధితులేనని, వెంటనే ధరణికి ముందున్న రికార్డులను పునరుద్ధరించి నిషేధిత భూముల(prohibited land)ను వెంటనే ఫ్రీ హోల్డ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం(BJP state office)లో కూకట్‌పల్లి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు, బాధితులు రాంచందర్ రావుని కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూకట్‌పల్లి వసంత్‌నగర్ వంటి ప్రాంతాల్లో మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేసిన ఫ్లాట్లు, ఆరుట్ల గ్రామంలోని దాదాపు 1,100 ఎకరాల భూములు రాత్రికిరాత్రే 22 ఏ నిషేధిత జాబితాలోకి చేరడంపై ఆగ్రహించారు. 

ఆస్తులను దోచుకునేందుకు కుట్ర

గత బీఆర్‌ఎస్ పాలన(BRS administration)లో ‘ధరణి(Dharani)’, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ‘భూభారతి’(Bhu-Bharat) పేరుతో రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురిచేస్తూ తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నారని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22 ఏ (నిషేధిత భూములు) నిబంధనను ఒక పెద్ద భూతంలా చూపిస్తూ పేద, మధ్యతరగతి ప్రజల ఆస్తులను దోచుకునేందుకు కాంగ్రెస్‌ప్రభుత్వం కుట్రపన్నుతోందని నిప్పులు చెరిగారు.

హైదరాబాద్ మహానగరంతో పాటు శివారు ప్రాంతాల్లో 60 నుంచి 70 శాతం మంది ప్రజలు ఈ 22 ఏ సమస్యతో ప్రత్యక్షంగా నష్టపోతున్నారని తెలిపారు. పైసలు చెల్లించి రిజిస్ట్రేషన్లు పూర్తయిన భూములను కూడా ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారన్నారు. ప్రజలు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుల భూములను సైతం 22ఏ లోకి నెట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ధ్వజమెత్తారు.

ఖజానా కోసమేనా?

ప్రైవేట్ భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి, ఆపై వాటిని సర్కారు భూములుగా మార్చి, వేలం వేసి ఖజానా నింపుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా మారిందని రాంచందర్‌రావు ఆరోపించారు. ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించాలి తప్ప, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదని హెచ్చరించారు. ఐదేళ్లు అధికారం ఇచ్చింది ప్రజల రక్తం తాగడానికి, వారి ఆస్తులను లూటీ చేయడానికి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2018 ధరణి నుంచి నేటి 2025--26 భూభారతి వరకు జరిగిన భూ లావాదేవీలు, 22 నిషేధిత భూముల వెనుక ఉన్న భారీ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ధరణికి పూర్వం ఉన్న రికార్డులను యథాతథంగా కొనసాగించాలని, సెక్షన్ 22ఏ కింద ప్రొహిబిట్ చేసిన ప్రైవేట్, సాధారణ ప్రజల భూములన్నింటినీ తక్షణమే తొలగించి ‘ఫ్రీ హోల్డ్’ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వం వెంటనే స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. ఇదే క్రమంలో, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ వీర సావర్కర్ వంటి మహనీయులపై అసత్య ప్రచారాలు చేయడాన్ని రాంచందర్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజాసమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు.