34వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి
వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి
టీచర్ల కొరతతోనే తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య
సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖ
ముషీరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల, ఆదర్శ, కస్తూర్బా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సుమారు 34 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య(R Krishnaiah) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి లేఖ రాసినట్లు బుధవారం విద్యానగర్‌లోని బీసీభవన్‌లో మీడియాతో వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే 14 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీంతో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ బోధనకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఉపాధ్యాయుల కొరత కారణంగా ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు. బీఈడీ, డీఈడీ వంటి అర్హతలు కలిగిన సుమారు 16 లక్షల మంది నిరుద్యోగులకు ఉ పాధి కల్పించడంతో పాటు ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఖాళీ పో స్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని కృష్ణయ్య కోరారు. పూర్తి స్థాయిలో టీచర్లను నియమిస్తే విద్యాప్రమాణాలు మెరుగుపడి, విద్యార్థులు భవిష్యత్తులో నైపుణ్యవంతులు గా ఎదుగుతారని స్పష్టం చేశారు.






