27 August, 2026 | 7:48 AM

అసెంబ్లీని స్తంభింపజేస్తాం

27-08-2026 01:44 AM
  1. ప్రజల ఆస్తుల కబ్జాల చుట్టే.. రేవంత్ పాలన 
  2.    22 ఏపై జెన్ జీ తరహా ఉద్యమం 
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు 
  4.    22 ఏపై బాధితులే విజయం సాధిస్తారు 
  5. లోక్ సత్తా వ్యవస్థపాక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ

హైదరాబాద్/కూకట్‌పల్లి, ఆగస్టు 26 (విజయక్రాంతి): 22ఏ సమస్యను పరిష్కరించకుంటే రాబోయే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) హెచ్చరించారు. 22ఏ పేరుతో 30 శాతం కమీషన్‌లకు కాంగ్రెస్ పాలకు లు తెరలేపారని, సమస్య పరిష్కరించకుంటే జెన్ జీ తరహాలో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) చూపం తా, ఆయన శ్రద్ధంతా భూముల చుట్టే తిరుగుతోం దని మండిపడ్డారు.

ప్రజల ఆస్తులను రక్షించేది పోయి, కబ్జాపాలన చేస్తున్నారని ఆరోపించారు. 22ఏ విషయంలో బాధితులే విజయం సాధిస్తారని లోక్ సత్తా వ్యవస్థపాక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ(Jayaprakash Narayan) అన్నారు. కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు ఆధ్వర్యంలో కూకట్‌పల్లి మండలం లోని 22ఏ, ప్రభుత్వం హోసింగ్ బోర్డు భూముల అమ్మకంపై నిరసించారు. స్థానికంగా 22ఏ నిషేధిత జాబితా బాధితులు, పలు పార్టీల నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao), లోక్ సత్తా వ్యవస్థపాక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ(Jayaprakash Narayan) హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... ప్రభుత్వమే ప్రజల ఆస్తుల పేరిట కబ్జాదారుగా మారిందని, రాత్రికి రాత్రే ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా(prohibited list)లో పెట్టిందని ఆరోపించారు. కేసీఆర్ పాలన ప్రజల చుట్టూ తిరుగితే.. రేవంత్‌రెడ్డి పాలన భూముల చుట్టూ తిరుగుతోందని ఎద్దేవా చేశారు.

రాత్రికి రాత్రే కోట్ల ఎకరాల భూముల(lands)ను నిషేధిత జాబితాలోకి చేర్చారని, ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత సారీ చెప్పి 22ఏ నిషేధిత భూముల నుంచి తొలగిం చడానికి దరఖాస్తు పెట్టుకోమంటున్నారని విమర్శించారు. దరఖాస్తు చేసుకున్నవారి ఫోన్ నంబర్ తీసుకొని 30 శాతం కమీషన్ కోసం బేరసారాలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. మర్డర్ చేసి సారీ చెప్తే సరిపోతుందా అని రేవంత్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.

రేవంత్‌రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రూ.30 వేల కోట్ల విలువైన హౌసింగ్ బోర్డ్ భూములను అమ్మిందని విమర్శిం చారు. రేపటి భవిష్యత్తు కోసం గుడులు, మసీదులు లాంటి ప్రార్థన మందిరాలు, పాఠశాలను నిర్మించడానికి భూములు లేకుండా, కనీసం చనిపోతే బొంద పెట్టడానికి కూడా జాగా లేకుండా ఈ ప్రభుత్వం భూములను అమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒకవైపు రేవంత్‌రెడ్డి ప్రభు త్వ భూములను అమ్మడమే కాకుండా అసైన్డ్ భూములను ఎస్సీ, ఎస్టీల నుంచి లాక్కొని పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నారని ఆరోపిం చారు. హెచ్‌సీయూకు చెందిన 400 ఎకరాల భూములను అమ్మకానికి పెట్టారు. అమ్మకానికి కుదరక బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో కుదవ పెట్టి రూ.10 వేలకోట్ల అప్పులు తెచ్చారని ఆరోపించారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలలోని 9 వేల ఎకరాల భూములను కుదువబెట్టి బ్రోకర్ లకు రూ.700ల కోట్ల లంచం ఇచ్చి రూ.10 వేల కోట్ల అప్పు తీసుకున్నారని వెల్లడించారు.

రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్ కాలేజీల ఆస్తులను బ్యాంకులలో కుదువపెట్టి పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటు యూనివర్సిటీలకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ సీఎం ప్రజల భూములను ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటిస్తూ, ప్రభుత్వ భూములను కుటుంబ సభ్యులకు కట్టబెడుతున్నాడని, ఈ మధ్య సొంత తమ్ముడికి వందల కోట్ల విలువైన భూములను కట్టబెట్టాడని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి 22 ఏను వ్యతిరేకిస్తున్న వాళ్లందరూ కబ్జాదారులు అంటున్నా రని, ఈ ప్రజలు కబ్జాదారులు కాదని ఈ ప్రభుత్వమే కబ్జాదారుగా మారిపోయిందని ఆగ్రహించారు.

ప్రజలపై పొంగులేటి ‘22 ఏ’ బాంబులు

 పొంగులేటి గతేడాది దీపావళి సమయంలో ప్రతిపక్షాలపై బాంబులేస్తామన్నారని, ప్రతిపక్షాలపై వేయలేదు కాని ఆయన ప్రజలపై 22 ఏ పేరుతో బాంబులు వేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.  ప్రజల కోసం ప్రశ్నిస్తే పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ గురించి తెలిసిన రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రజల భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టి ఇబ్బందులు పెడతారా అని ప్రశ్నించారు.

‘మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తెలిస్తే.. బీఆర్‌ఎస్ నాయకులకు ఉద్యమాలు తెలుసు.. పోరా టాలు తెలుసు.. 22 ఏను తొలగించే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. 22ఏను తొలగించకుంటే ఢిల్లీ జెన్ జీ ఉద్యమం తరహా ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.

సత్వరమే ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని, లేనిపక్షంలో అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజే స్తామని, బాధితులు అందరితో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. 22 ఏ విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ బాధితులందరికీ అండగా ఉంటుందని, ఎవరు కూడా బ్రోకర్లను నమ్మవద్దని సూచించారు. 

22ఏ విషయంలో బాధితులదే విజయం: జయప్రకాశ్‌నారాయణ

ప్రజాస్వామ్యంలో పార్టీలు ఏవైనా.. ప్రభుత్వాలేవైనా.. కూడా ప్రజల హక్కులకు కాపలాదారులు అని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. న్యాయం, ధర్మం, వాస్తవం, చట్టాలను ప్రభుత్వాలు కాపాడాలని, వాటిని కాపాడలేకపోతే ఆ ప్రజాస్వా మ్యానికి  అర్థం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. 22 ఏ విషయంలో బాధితులు విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ... కూకట్‌పల్లి నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రభుత్వం పగ పట్టిందని, తనపై కోపం ఉంటే తననే చంపేయాలని అన్నారు. కానీ తన నియోజకవర్గ ప్రజలపై కోపం చూపెట్టవద్దని ప్రభుత్వాన్ని కోరారు. నియోజకవర్గ ప్రజలను రాజకీయ కక్షతో ఇబ్బందిపెడితే తాను ఉరిబెట్టుకొని చావడానికైనా సిద్ధమని, ప్రభుత్వంతో పోరాడడానికైనా సిద్ధమని హెచ్చరించారు. 70 వేల భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజల కోసం చావడానికైనా సిద్ధమన్నారు.