ప్రభుత్వ విద్యార్థుల సునామీ
తెలంగాణలో ఈసారి తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాలలో రాష్ట్రవ్యాప్తంగా 91.31 శాతం సాధించి విద్యార్థులు చరిత్ర తిరగ రాశారు. బాలురు 89.42 శాతం, బాలికలు 93.23 శాతం సాధించి ముందు నిలిచారు. 3,927 పాఠశాల్లో వంద శాతం పాస్ కాగా, 6 బడుల్లో సున్నా ఫలితా లు వచ్చాయి. ప్రైవేటు పాఠశాల విద్యార్థుల కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ర్యాంకుల వర్షం కురి పించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చరిత్ర తిరగ రాశారు.
ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా తమ సత్తా చాటారు. వేలాది రూపాయల ఫీజులు కట్టి ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను సైతం తలదన్నే లా రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూల్, కస్తూరిబా, మైనారిటీ పాఠశాల, బి.సి ,ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు తమకు లభించిన అరకొర వసతులతోనే నెగ్గుకు వచ్చి అసాధారణ ప్రతిభను చాటడం అభినందనీయం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే బాలురతో పోలిస్తే బాలికలు పరీక్షా ఫలితాల్లో ఒక మెట్టు పైచేయి సాధించడం మరో విశేషం. ఇది ఆడపిల్లల తల్లి దండ్రులకు సరికొత్త ఆశలను రేకేత్తించింది.
నిర్మల్‌జిల్లా 99.050 శాతంతో ప్రథమ స్థానంలో,65.10 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. సిద్ధిపేటజిల్లా 98.65 శాతంతో రెండవ స్థానంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా 98.27తో మూడవ స్థానంలో నిలిచాయి. రాష్ట్ర విద్యా శాఖవారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య కోసం మంచి నైపుణ్యం గల ఉపాధ్యాయులతో తర్పీదు ఇప్పిస్తుండటం ఆనంద దాయకం. అవసరమైన అన్ని వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అల్పాహారం అం దించి ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఫలితంగానే ఇంతటి గొప్ప ఫలితాలు ప్రభుత్వ విద్యార్థులకు వచ్చాయి. ఏది ఏమైన ఇలా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాంకుల సునామీని సృష్టించడం ఆహ్వానించదగ్గ పరిణామం. పరీక్షల్లో తప్పిన విద్యార్థులు క్షణిక ఆవేశాలకు లోను కావద్దు. ఎంతోమంది ఫెయిల్ అయి మళ్ళీ పరీక్ష రాసి ఉన్నత ఉద్యోగాలు పొందుతుంటారు కూడా. నేటి ఓటమి రేపటి గెలుపుకు నాంది కావాలి.
కామిడి సతీష్ రెడ్డి
సెల్: 9848445134






