ఫిరాయింపులను అరికట్టాలి
ఒక పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థి వేరే పార్టీకి మారకుండా చూడడం కోసం రాజ్యాంగ సవరణ చేసి మరీ తీసుకు వచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం రాజకీయ నాయకుల చేతిలో నగుబాటుగా మారుతోంది. చట్టంలో ఉన్న లోపాలను సాకుగా చేసుకుని పదేండ్లుగా నేతలు ఇష్టారాజ్యంగా పార్టీలు మారిపోతున్నారు. ఈడీ, ఐటీ దాడులు లాంటి వాటి భయం కారణంగా నేతలు తరచూ పార్టీలు మారుతున్నారు. మహారాష్ట్రలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలే దీనికి నిదర్శనం. ఇది ప్రజా స్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే చట్టంలోని లోపాలను సవరించాల్సిన అవసరముంది.
కన్నోజు శ్రీహర్ష
భారతదేశంలో ఎన్నికలు అనేది ఒక ప్రజాస్వామికమైన పద్ధ తి. మన రాజ్యాంగంలోని అధికరణ 323 నుండి 329 వరకు దేశంలో ఎన్నికల నియమావళిని తెలుపుతుంటాయి. మరే దేశంలో లేని విధంగా ప్రపంచంలోనే మొదటిసారి అందరికీ ఓటు హక్కు పద్దతిని మన రాజ్యాంగం కల్పించింది. అమె రికా లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో సైతం మహిళలకు ఓటుహక్కు 1965 తరువాత నే కల్పించడం జరిగింది. ఇంతటి ప్రాధా న్యం వున్న ఎన్నికల విధానంలోని లోటుపాట్లను సవరించాల్సిన అవసరం ఉంది.
ఎన్నికలో గెల్చిన నాయకులు పార్టీలు మారకుండా 1985లోనే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ కింద చేర్చారు. కానీ, మారుతున్న రాజకీయ సమీకరణా లు పరిస్థితుల వల్ల నాయకులూ తరచూ పార్టీలు మారడం గత 10 సంవత్సరాల నుండి విపరీతంగా జరుగుతున్నది. దీన్ని అరికట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఇది కొనసాగితే దేశ ప్రజాస్వామ్య విధానాలకు ముప్పు కలుగుతుంది. దేశంలో 2014 నుండి రాజకీయాలు వాటి విలువలు తగ్గుతూ వస్తున్నాయి. క్రియాశీలక నేతలుసైతం కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తు న్నారు. బీజేపీ దూకుడు, కాంగ్రెస్ ప్రభుత్వాలను నిలపెట్టుకోలేకపోవడం, ప్రతి పక్షనేతలపై ఈడీ, ఐటీ దాడులు లాంటి వాటివల్ల నేతలు తరచూ పార్టీలు మారుతున్నారు. విపక్షంలో విధి విధానాలు లేక ఇలా జరుగుతున్నట్టు అర్థమవుతున్నది. ఇది ఏ మాత్రం హర్షించదగ్గ విషయం కాదు. రాజకీయాల్లో ఇదే తీరు కొనసాగితే దేశ ప్రజాస్వామ్యానికే ముప్పులా మారుతుంది. పార్టీ ఫిరాయింపు చట్టంలోని కొన్ని లొసుగులను వెతుక్కుంటూ నేతలు పార్టీలు మారుతుండడం విడ్డూ రం. దేశంలో మారుతున్న రాజకీయాల దృష్ట్యా ఈ చట్టాన్ని సైతం సవరించాల్సిన సమయం వచ్చింది .
చట్టం ఏం చెబుతున్నది?
పార్టీ ఫిరాయింపుల చట్టంలో కేవలం 3 అంశాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వ డం జరిగింది. పార్టీ మారే ఒక్కరిద్దరు నాయకులకు, స్వతంత్ర అభ్యర్థులకు, నామినేటెడ్ అభ్యర్థులకు మాత్రమే ఈ చట్టంలో అనర్హత వేటు పడే విధంగా ఉంది. కానీ, పార్టీ మారే నాయకులూ ఈ చట్టంలోని మినహాయింపులను చూసుకొని మారుతున్నారు. పార్టీ మారే అభ్యర్థు లు పార్టీలోని 2/3 వంతు మెజారిటీ చూసుకొని వారి పార్టీ శాసనసభా పక్షా న్ని విలీనం చేసి ఫిరాయింపు చట్టం నుండి మినహాయింపు పొందుతున్నారు. దీనివల్ల పార్టీలో చీలిక రావడం తరుచూ చూస్తు న్నాం. మహారాష్ట్రలోని శివసేన, ఎన్‌సీపీ పార్టీలు ఈ విధంగానే చీలిపోయాయి. ఈ చీలికలు బలంగా ఉన్న బీజేపీ పార్టీకి ఒక ఆయుధంగా మారింది. ఈ చట్టంలో నామినేటెడ్ అభ్యర్థులుసైతం కేవలం 6 నెలల గడువు మాత్రమే ఇవ్వడం వల్ల 6 నెలలలోపు పార్టీ మారడం నామినేటెడ్ అభ్యర్థులకు కూడా తేలికైపోయింది. ఈ విధంగా నాయకులు చాలాసార్లు ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కి పార్టీలు మారుతున్నారు. పార్టీలు అనేకసార్లు కోర్టు మెట్లు ఎక్కినా లాభం లేకుండా పోతుంది. స్పీకర్ చేతిలో తుది నిర్ణయం ఉండడంతో నేతలపై పార్టీ ఫిరాయింపు అభియోగాలు అలానే పెండింగ్ ఉండిపోతున్నాయి. ఎలక్షన్ కమిషన్ సైతం అంతర్గత పార్టీలోనే నిర్ణయం తీసుకోవాలని అనడంతో ఈ చట్టానికి ఈరోజు అర్థం లేకుండా పోయిం ది. దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాజకీయ విలువలు కాపాడేలా చట్టంలో సవరణలు చేయాల్సిన అవసరం ఉంది.
ఏం చేయాలి?
మొదటగా పార్టీ ఫిరాయింపు చట్టంలో 2/3 విలీన అంశాన్ని పార్టీ అధ్యక్షుని అనుమతి తప్పనిసరిగా తీసుకునే విధంగా సవరణ చేయాలి. ఫిరాయింపు అంశం స్పీకర్‌కే వదిలేయకుండా ఇటీవల సుప్రీంకోర్టు చెప్పినట్టు ప్రధాన న్యాయమూర్తిని సైతం అందులో భాగం చేయాలి. దేశం లో రాష్ట్రపతి అధ్యక్షతన, రాష్ట్రంలో గవర్న ర్ అధ్యక్షతన రాజకీయ నిపుణులతో కూడి న కమిటీని వేసి, పార్టీ మారే అంశాన్ని మొదటగా వారికి తెలియచేసి, వారి అనుమతి సైతం తీసుకునే విధంగా సవరణ చేయాలి. పార్టీ మారడం అనివార్యమైనప్పుడు అతను వెళ్తున్న పార్టీలో సైతం 2/3 మెజారిటీ సభ్యుల అనుమతి మేరకే ఆ నాయకుడిని పార్టీలో చేర్చుకునే పద్ధతిని తీసుకురావాలి. లేకపోతే, పార్టీ ఫిరాయిం పు చట్టం సభ్యుడికే కాక వెళ్లిన పార్టీపై కూడా పడే విధంగా చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ సైతం పార్టీ విలీన అంశాన్ని, పార్టీ లోగో అంశాన్ని నిపుణుల కమిటీద్వారానే నిర్ణ యం తీసుకోవాలి. ‘కీహోతో హుల్హాహం వర్సెస్ జొచ్చిళ్లం’ కేసు తీర్పును, ఎస్‌ఆర్ బొమ్ము కేసును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ సైతం పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడతున్న వారిపై భారీస్థాయిలో నిషేధాలను విధించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా చట్టంలో మార్పులు రావాలి.
పార్టీల అంతర్గత బలం
అంతర్గతంగా పార్టీ లోపాలు సైతం నేతలను తరచూ పార్టీ మారే విధంగా చేస్తుంటాయి. అన్ని రాజకీయ పార్టీలు మొదట వారి నేతలకు కార్యకర్తలకు పార్టీ సంస్థాగతులు, విధానాలపై పార్టీ పెద్దలు శిక్షణ ఇవ్వాలి. పార్టీలు సైతం విధానాలను బాగా తెలిసిన నాయకులకే టిక్కెట్లు ఇవ్వ డం వల్ల వారు పార్టీ మారే అవకాశాలు ఉండవు. పార్టీ నేతలకు తరచూ ప్రతి 3 నెలల కొకసారి శిక్షణా తరగతులను నిర్వహించాలి. అధికార పార్టీ తమ ప్రభుత్వం చేస్తున్న విధానాలను, ప్రజల్లోకి తీసుకు వెళ్ళేలా నేతలకు దిశా నిర్దేశం చేయాలి. విపక్షం వారు ప్రజల అవసరాల దృష్ట్యా ప్రభుత్వానికి వినిపించే దిశగా పోరాట స్ఫూర్తిని కల్పించాలి. ఇలా, అన్ని పార్టీలు చేసినప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులను కొంత మేరకు తగ్గించవచ్చు. ప్రతీ నాయకుడికి పార్టీ విధి విధానాలు తెలిసి ఉండే విధంగా ప్రణాళికలను వేసుకోవాలి. ప్రాంతీయ పార్టీలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పార్టీలు అందరూ తమ విధి విధానాలను వారి నేతలకు, కార్యకర్తలకు వివరిం చడం తప్పనిసరి. లేకపోతే తీవ్ర నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ఈ చట్టాన్ని సవరించే దిశగా చర్యలు వుంటాయని ఆశిద్దాం.
- వ్యాసకర్త సెల్: 8985130032






