9 August, 2026 | 2:16 AM

అమోర్ హాస్పిటల్స్‌లో అరుదైన చికిత్స

09-08-2026 12:48 AM

మూడేళ్లుగా మంచానికే పరిమితమైన యువకుడికి మళ్లీ నడక

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో తలకు గాయమై మూడేళ్లుగా మంచానికే పరిమితమైన 34 ఏళ్ల వ్యక్తికి అమోర్ హాస్పిటల్స్ వైద్యులు అరుదైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిర్వహించి మళ్లీ నడిచేలా చేశారు. జూలై 21న కుడి కాలుకు, జూలై 27న ఎడమ కాలుకు శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. తీవ్రమైన బ్రెయిన్ ఇంజ్యూరీ తర్వాత ఏర్పడే న్యూరోజెనిక్ హెటెరోటోపిక్ ఆసిఫికేషన్ కారణంగా రోగి రెండు తుంటి భాగాల్లో అదనంగా ఎముక పెరిగి, కాళ్లు బిగుసుకుపోయాయి.

తుంటి, మోకాలు, మడమల వద్ద కాంట్రాక్చర్స్ కారణంగా నిలబడటం, నడవడం కూడా సాధ్యం కాలేదు. అమోర్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. కిషోర్ బి. రెడ్డి నేతృత్వంలోని మల్టీడిసిప్లినరీ ఆర్థోపెడిక్ బృందం దశలవారీగా సంక్లిష్ట శస్త్రచికిత్సలు నిర్వహించింది. అదనంగా పెరిగిన ఎముకను తొలగించి, బిగుసుకుపోయిన కీళ్లను సరిచేశారు. శస్త్రచికిత్సల అనంతరం రోగి మూడేళ్ల తర్వాత మళ్లీ సూటిగా నిలబడటంతో పాటు, సహాయంతో నడిచే స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఫిజియోథెరపీ, గెయిట్ ట్రైనింగ్తో కూడిన రీహాబిలిటేషన్ చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.