15 April, 2026 | 3:28 AM

ఆర్‌సీబీ టాప్ లేపుతుందా?

15-04-2026 01:16 AM

చిన్నస్వామిలో లక్నోతో మ్యాచ్

భీకర ఫామ్‌లో ఆర్‌సీబీ బ్యాటర్లు

బెంగళూరు, ఏప్రిల్ 14: ఐపీఎల్ 19వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో అంచనాలకు తగ్గట్టే రాణిస్తున్న ఆర్సీబీ నాలుగు మ్యాచ్ లలో మూడింట గెలిచింది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్న ఆర్సీబీ ఇప్పుడు టాప్ ప్లేస్ పై కన్నేసింది. మరోసారి టైటిల్ గెలవాలనుకుంటున్న బెంగళూరు సూపర్ ఫామ్ తో దూసుకెళుతోంది. భీకరమైన బ్యాటింగ్ లైనప్‌తో ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తోంది. కోహ్లీ, సాల్ట్ లాంటి ఓపెనర్లు, పటిదార్, పడిక్కల్, జితేశ్ శర్మలతో పాటు టిమ్ డేవిడ్ లాంటి హిట్టర్లు ఆర్సీబీకి కీలకంగా మారారు.

ముఖ్యంగా పటిదార్ దుమ్మురేపుతున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌లతో జట్టుకు భారీ స్కోర్లు అందిస్తున్నాడు. అటు ఫినిషర్ టిమ్ డేవిడ్ కూడా చెలరేగిపోతున్నాడు. చివర్లో ప్రత్యర్థి జట్ల బౌలర్లను ఉతికారేస్తున్నాడు. ఇక బౌలింగ్ లోనూ బెంగళూరు సమిష్టిగా రాణిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ తప్పిస్తే మిగిలిన మూడు మ్యాచ్ లలో ఆర్సీబీ బౌలర్లు అదరగొట్టారు. భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా, మంగేశ్ యాదవ్, జాకబ్ డపీ ఆర్సీబీ బౌలింగ్ ను సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాశ్ శర్మ ఇంపాక్ట్ చూపిస్తున్నాడు.

మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్ లలో రెండు గెలిచి, రెండు ఓడిన లక్నో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. వరుసగా సన్‌రైజర్స్, కోల్ కతా జట్లపై గెలిచిన ఆ జట్టు తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పాలైంది. ఆ మ్యాచ్ లో బ్యాటర్ల వైఫల్యమే లక్నో ఓటమికి కారణమైంది. మార్కరమ్ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లందరూ నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు.

పంత్, మార్ష్ , పూరన్, అబ్దుల్ సమద్ లాంటి హిట్టర్లు ఉన్నా నిలకడగా రాణించలేకపోతున్నారు. కోల్‌కతాపై సంచలన ఇన్నింగ్స్ ఆడి వెలుగులోకి వచ్చిన ముకుల్ చౌదరిపై అంచనాలున్నాయి. అటు బౌలింగ్ పరంగా మహ్మద్ షమీ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. మిగలిన బౌలర్లలో అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ వికెట్లు తీస్తున్నా భారీగా పరుగులు ఇచ్చేస్తున్నారు.  జార్జ్ లిండే సైతం పెద్దగా ప్రభావం చూపకపోగా.. స్పిన్నర్ దిగ్వేశ్ ఆకట్టుకుంటుండగా...ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆయుశ్ బదోనీని కొనసాగించే అవకాశముంది.

గత రికార్డులు 

ఇరు జట్లు ఆరు మ్యాచ్‌లలో తలపడితే... ఆర్సీబీ నాలుగు సార్లు విజ యం సాధించింది. ల క్నో 2 మ్యాచ్‌ల లో గెలిచింది.

పిచ్ రిపోర్ట్ 

మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న చిన్నస్వామి స్టేడియం పూర్తిగా బ్యాటింగ్‌కే అనుకూలం. దీంతో హై స్కోరింగ్ మ్యాచ్ ఖాయమని చెప్పొచ్చు.

తుది జట్లు అంచనా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్(కెప్టెన్), కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, మంగేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, సుయాశ్ శర్మ.

లక్నో సూపర్ జెయింట్స్: మిఛెల్ మార్ష్, మార్కరమ్, రిషబ్ పంత్(కెప్టెన్ కమ్ కీపర్), నికోలస్ పూరన్, అబ్దుల్ సమ్మద్, ముకుల్ చౌదరీ, జార్జ్ లిండే , షమీ, అవేశ్ ఖాన్, దిగ్వేశ్, ప్రిన్స్ యాదవ్.