21-01-2026 12:56:18 AM
భూపాలపల్లి జిల్లాలో 13 గ్రామాల్లో రీ సర్వే
జయశంకర్ భూపాలపల్లి, (మహబూబాబాద్) జనవరి 20 (విజయక్రాంతి): గ్రామాల్లో తరచుగా చోటుచేసుకుంటున్న భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే తోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 13 గ్రామాల్లో భూముల రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించడానికి కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వ భూ సర్వే చట్టం సెక్షన్ 5(1), 6(1) కింద గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసి, జిల్లాలో మొదటగా 13 గ్రామాలను రీ సర్వే చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.
ఈ గ్రామాల్లో గ్రామ నక్షాలు (గ్రామ పటాలు) లేకపోవడం లేదా అస్పష్టంగా ఉండడం వల్ల రైతుల పొలాల హద్దులను ఖచ్చితంగా నిర్ణయించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనివల్ల గట్టు (సరిహద్దు) వివాదాలు తరచుగా జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. రీ సర్వే ద్వారా రైతులకు పలు ప్రయోజనాలు చేకూరనున్నాయని వివరించారు. రీ సర్వే ప్రక్రియలో పొలాల గట్టు హద్దులు, రోడ్లు, చెరువులు, కాలువలు, గ్రామ కంటం భూములు తదితరాలను ఖచ్చితంగా గుర్తించి, శాస్త్రీయ పద్ధతిలో హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు.
అలాగే ప్రతి రైతు భూమికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన ఖచ్చితమైన భూ పటాలను అందజేయడం జరుగుతుందన్నారు. దీని ద్వారా భూ వివాదాలు పూర్తిగా నివారించ బడతాయని, భూ లావాదేవీలు సులభతరం అవుతాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు..ఈ మేరకు జిల్లాలోని టేకుమట్ల మండలం రామకృష్ణాపురం, మొగుళ్ళపల్లి మండలం అకినేపల్లి గ్రామాల్లో మంగళవారం భూముల రీ సర్వే అంశంపై గ్రామ సభలు నిర్వహించారు. ఆయా గ్రామసభల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని రీ సర్వే నిర్మాణ వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు.