calender_icon.png 21 January, 2026 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి మత్తులో విద్యార్థులు

21-01-2026 12:56:06 AM

  1. మేడ్చల్‌లోని ఓ విల్లాలో సేవిస్తుండగా పట్టుకున్న పోలీసులు

పదిమంది అరెస్ట్ 

ఐదుగురు మల్లారెడ్డి కాలేజీ స్టూడెంట్స్

ఆరు కిలోల గంజాయి, హాష్ ఆయిల్ స్వాధీనం 

మేడ్చల్, జనవరి 20 (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో మంగళవారం పోలీసులు గంజాయి స్థావరంపై దాడి చేసి, సేవిస్తున్న పదిమంది విద్యార్థులను పట్టుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు, సేవిస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. ఇందులో ఐదుగురు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలోని విల్లాలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు మంగళవారం దాడులు చేశారు. ముగ్గురు వ్యక్తులు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తుండగా పట్టుకున్నారు.

ముగ్గురు విక్రేతలతో పాటు ఏడుగురు వినియోగదారులైన విద్యార్థులు ఉన్నారు. వీరందరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 6 కిలోల గంజాయి, హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. వీరందరికి గాంధీ ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ విల్లాలో విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసింది. మేడ్చల్ చుట్టుపక్కల ఇంజనీరింగ్ కళాశాలలు, మెడికల్, ఇతర వృత్తి విద్య కళాశాలలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

విద్యార్థులు ఇక్కడ కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. మరికొందరు ఇక్కడే సేవిస్తున్నారు. మేడ్చల్ లో గంజాయి, హాష్ ఆయిల్ పట్టుబడడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి టీవీలలో మల్లారెడ్డి కాలేజీ విద్యార్థులు గంజాయి సేవిస్తూ దొరికినట్లు స్క్రోలింగ్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళనతో విద్యార్థులకు ఫోన్లు చేశారు.