23 June, 2026 | 8:57 PM

చదువే మన తలరాత!

06-09-2025 02:11 AM

రాష్ట్రంలో నూతన విద్యావిధానం కావాలి 

-టీచర్లు కష్టపడితేనే నేను రెండోసారి సీఎం అవుతా!

-కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ విద్య ఉండాలి

-ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యను అందిద్దామని ప్రతిజ్ఞ చేద్దాం  

-మేం అధికారంలోకి వచ్చిన.. 55 రోజుల్లోనే 11 వేల టీచరు పోస్టులు భర్తీ చేశాం 

-గురుపూజోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : తెలంగాణకు నూతన విద్యా విధానం కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని, ఇందులో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంచేశారు. విద్యా పాలసీ కోసం ఒక కమిటీని నియమించామని, పేద పిల్లల జీవితాలను మార్చేలా ఆ పాలసీ ఉండాలన్నారు.  ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుదామని సీఎం సూచించారు.

విద్య ఒక్కటే మన తలరాతను మారుస్తుందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా మన విద్యార్థులను తీర్చి దిద్దుతామని చెప్పా రు. పునాది బలంగా ఉన్నప్పుడే ఎన్ని అంతస్తులైనా కట్టొచ్చని, అలాగే విద్యా విషయంలో పునాది బలంగా ఉన్నప్పుడే విద్యార్థులు భవిష్యత్‌లో డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కాగలుగుతారని, ఆ బాధ్యత ఉపాధ్యాయు లపై ఉందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళావేదికలో గురుపూజోత్సవం కార్యక్ర మానికి ముఖ్యమంత్రి హాజరై మాట్లాడారు.

తెలంగాణ రాష్ర్ట సాధనలో ఉపాధ్యాయులు క్రియాశీలక పా త్ర పోషించారని ఆయన అన్నారు. ప్రతి గ్రామానికి జై తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఉపాధ్యాయులేనని  చెప్పారు. ఆనా డు జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించేలా చేశారని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో గురుపూజోత్సవానికి అప్పటి ముఖ్యమంత్రి ఏనాడూ హాజరుకాలేదని అన్నారు. గతంలో టీచర్ల నియామకం కూ డా చేపట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, కేవలం 55 రోజుల్లోనే 11 వేల టీచర్ల నియామకాలు పూర్తి చేశామన్నారు.

డైట్, కాస్మోటిక్ చార్టీలు కూడా పెం చామని సీఎం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగ తులు బోధిస్తున్నామని అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకంటే నాణ్యమైన విద్య అందస్తామని మనమంతా  ప్రతిజ్ఞ చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఏటా 200 మంది టీచర్లను విదేశాలకు పంపి అక్కడి విద్యావిధానం అధ్యయనం చేసేలా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ రెండోసారి సీఎం కావడానికి ఆయన చేసిన విద్యాభివృద్ధే కారణమని చెప్పారు.

తనకూ స్వార్థం ఉందని టీచర్లు బాగా పనిచేస్తే రెండోసారి సీఎం అవ్వాలనుకుంటు న్నట్లు రేవంత్‌రెడ్డి నవ్వుతూ అన్నారు. ‘నేను ఫామ్‌హౌస్‌లో పడుకుంటా.. నన్ను మళ్లీ సీఎంను చేయండి అనట్లేదు.. నేనూ కష్టపడతా’ అని సీఎం చెప్పారు. విద్యాభివృద్ధి కో సం టీచర్లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని అన్నారు. వరల్డ్ బెస్ట్ మోడల్‌గా యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నామని, నిరుద్యోగ యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏ ర్పాటు చేశామని తెలిపారు. 65 ఐటీఐలు అప్‌గ్రేడ్ చేసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌గా మార్చామని, ఏటీసీలో టాటా కంపెనీ క ల్పించిన సదుపాయాలు చూస్తే తనకే మతిపోతుందని సీఎం అన్నారు.  

నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నా.. 

‘గతంలో చాలా మంది సీఎంలు రెవె న్యూ శాఖ, ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ లు తమ వద్ద పెట్టుకున్నారు. కానీ నేను మీ సోదరుడిగా విద్యా శాఖను నా దగ్గర పెట్టుకున్నాను. గత ప్రభుత్వ పదేళ్ల కాలంలో ఆగ మైన విద్యాశాఖను నా వద్దే పెట్టుకుని స్వ యంగా పర్యవేక్షిస్తున్నా’నని సీఎం తెలిపారు. విద్యా శాఖను ఇంకెవరికైనా ఇవ్వాలని కొం దరు అడుగుతున్నారని, అయితే విద్యా శాఖలోని సమస్యలను అర్థం చేసుకుని పరిష్క రించేందుకు తానే ఆ శాఖను తీసుకున్నానని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడొచ్చినా సమస్యలు విని పరిష్కరించే ప్రయ త్నం చేశామని, ఎక్కడైనా కొంత ఆలస్యం కావచ్చు కానీ సమస్య పరిష్కరించకుండా ఉండదని తెలిపారు.  

ఒలింపిక్స్‌లో ఒక్క స్వర్ణం రాలేదు..

దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్న మనకు ఒలింపిక్స్‌లో ఒక్క స్వర్ణం సాధించలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ కొరియాలో ఒక్క యూనివర్సిటీనే 16 స్వర్ణ పతకాలు సాధించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీయం డని, వారికి ప్రభుత్వమే అన్ని సదుపాయా లు కల్పిస్తుందన్నారు. చదువు ఒక్కటే భవిష్యత్ కాదని, క్రీడల్లో రాణించినా భవిష్యత్ ఉంటుందని అన్నారు. క్రీడల్లో రాణించిన క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీలుగా ప్రస్తుతం ఉన్నారని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలపై ఆసక్తి ఉన్నవారిని గుర్తించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచిం చారు. ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయి పెడ్లర్‌గా మారుతున్నారని, డ్రగ్స్ వ్యసనాలు ఇప్పుడు చిన్న స్థాయి మండలాలకు కూడా వ్యాపించాయని అన్నారు. దీనిని తల్లిదండ్రులు నిశితంగా పరిశీలించాలని సూచిం చారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చినట్లు తెలిపారు.

3 లక్షల మంది విద్యార్థులు కొత్తగా..

 గత ప్రభుత్వానికి వర్సిటీలకు వీసీలను నియమించడానికి తీరిక కూడా లేదని, దానిలో కూడా రాజకీయాలు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ప్రభుత్వం, టీచర్ల చొరవతో కొత్తగా 3 లక్షల మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని కొనియాడారు. ప్రైవేట్ స్కూళ్ల టీచర్ల కంటే ప్రభుత్వ టీచర్లకు నైపుణ్యం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 10 వేల పాఠశాలల్లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు.

టీచర్లకు జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, మౌళిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకే అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో స్వయం సహాయ సంఘాలకు నిర్వహణ బాధ్యత అప్పగించి.. ప్రతి ఏటా రూ. 130 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. చదువు ఒక్కటే పేదల తలరాతను, రాష్ట్రం తలరాతను మారుస్తుందని చెప్పారు. టీచర్లు అంటే ఒక కుటుంబ పెద్దగా భావించాలని సీఎం సూచించారు.  తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్ల సహకారం కావాలని, పిల్లలు ఎక్కువ సమయం వారి వద్దే ఉంటారని అన్నారు. పిల్లలతో కలిసే టీచర్లు మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

మూతపడే పరిస్థితికి  ఓయూ, కేయూ.. 

ఉస్మానియా యూనివర్సిటీ వైభవం కోల్పోయే స్థితికి గత ప్రభుత్వం తీసుకొచ్చిందని, యూనివర్సిటీ మూతపడే పరిస్థితికి వచ్చిందని అని సీఎం అన్నారు. ప్రొఫెసర్లను నియమించకుండా యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని చెప్పారు.  చాలా చోట్ల కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందడం లేదని సీఎం తెలిపారు. విద్యార్థులకు గత ప్రభుత్వం సరైన ఆహారం అందించలేదని, విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుందని విమర్శించారు.