calender_icon.png 18 July, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక పోరుకు సంసిద్ధం!

18-07-2025 12:05:58 AM

  1. తేలిన ఎంపీపీ, జడ్పిటిసీ, ఎంపీటీసీల లెక్క
  2. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 75 జడ్పిటిసి, ఎంపీపీ, 778 
  3. ఎంపీటీసీ స్థానాలు ఖరారు పల్లెల్లో స్థానిక ఎన్నికల సందడి షురూ

మహబూబాబాద్, జూలై 17 (విజయ క్రాంతి): స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 75 జిల్లా ప్రాదేశిక (జెడ్ పి టి సి) స్థానాలు, 75 ఎంపీపీ స్థానాలు, 778 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. 2019 ఎన్నికలతో పోలిస్తే 17 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. 4 ఎంపీపీ, జడ్పిటిసి స్థానాలు పెరిగాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన స్టేషన్ ఘనపూర్, కేసముద్రం, ములుగు మున్సిపాలిటీల వల్ల గతంలో ఉన్న ఎంపీటీసీ స్థానాలకు 17 తగ్గిపోగా, కొత్తగా ఏర్పడ్డ ఇనుగుర్తి, సిరోలు, కొత్తపల్లి గోరి, మల్లంపల్లి మండలాలుగా ఏర్పడ్డాయి. దీనితో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్తగా నాలుగు జడ్పిటిసి, నాలుగు ఎంపీపీ స్థానాలు పెరిగాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార వర్గాలు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బంది కేటాయింపు ప్రక్రియ, రూట్ మ్యాప్, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితర కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించారు.  స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చ జెండా  ఊపడమే తరువాయిగా, రిజర్వేషన్ల ప్రకారం స్థానాలను కేటాయించి స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాటు చేసినట్లు ప్రచారం సాగుతోంది. 

ఉమ్మడి జిల్లాలో ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీటీసీ స్థానాల వివరాలు

మహబూబాబాద్ 18 జెడ్పిటిసి స్థానాలు, 18 ఎంపీపీ స్థానాలు, 193 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇక ములుగు జిల్లాలో 10 జెడ్పిటిసి, 10 ఎంపీపీ, 83 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలో 12 జడ్పిటిసి, 12 ఎంపీపీ, 109 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జనగామ జిల్లాలో 12 జెడ్పిటిసి 12 ఎంపీపీ, 134 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో 12 జెడ్పిటిసి, 12 ఎంపీపీ, 129 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇక వరంగల్ జిల్లాలో 11 జడ్పిటిసి, 11 ఎంపీపీ, 130 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.