calender_icon.png 18 July, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

18-07-2025 12:06:15 AM

- రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ తప్పుడు ఆరోపణలు

- స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొనే ఈ నాటకాలు

- నీటి పంపకాలపై సామరస్య పరిష్కారమే ఉత్తమం

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు 

హైదరాబాద్, జులై 17 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకానికి తెర తీసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. తెలంగాణలో యూరియా కొరత ఉందంటూ తప్పుడు ఆరోపణలతో రైతులను దగా చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో గురువారం కిసాన్‌మోర్చ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అసవరమైన దానికంటే ఎక్కువ యూరియా సరఫరా చేస్తోందన్నారు. గత రబీ సీజన్‌కు తెలంగాణకు 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, కేంద్రం 12.02 లక్షల  మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసిందన్నారు.

అలాగే డీఏపీ 1.47 లక్షల టన్నులు అవసరం ఉండగా, 1.72 లక్షల టన్నులు అందించిందని రాంచందర్‌రావు తెలిపారు. కేంద్రం నుంచి అదనపు సరఫరా ఉన్నప్పటికి రాష్ట్రంలోని మార్క్‌ఫెడ్‌లో ఆర్థిక సమస్యలు, పంపిణీలో లోపాల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ వైఫల్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన హితవు పలికారు. కృష్ణా, గోదావరి నీటి పంపకాలతో పాటు బనకచర్ల అంశం రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

నదీ జలాల పంపకాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవ్వడం శుభపరిణామమన్నారు. సమస్య పరిష్కారం కంటే రాజకీయమే ఎక్కువగా కనిపిస్తోందన్నారు. నదీ జలాల పంపకంపై పార్టీ నేతృత్వంలో ఒక కమిటీని కూడా  ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్‌రెడ్డి, కిసాన్‌మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.