అహ్మదాబాద్‌లో రియాల్టీ జోరు
- ఐదేళ్లలో 45శాతం పెరిగిన ధరలు
ప్రాప్ టైగర్ తాజా నివేదికలో వెల్లడి
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 29 (విజయక్రాంతి) : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రియల్ రంగం జోరుమీద ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా అక్కడ రియల్ గ్రోత్ కనిపిస్తుంది. గడిచిన ఐదేండ్లలో అహ్మదాబాద్ నగరంలో ఇళ్ల ధరలు ఏకం గా 45 శాతం మేర పెరిగాయని ‘ప్రాప్ టైగర్ డాట్ కామ్’ తాజాగా తన నివేదికలో వెల్లడించింది. 2019 జనవరి-, ఫిబ్రవరి, మార్చి త్రైమాసి కంలో చదర పు అడుగుకు రూ.2,867 ఉండగా, 2024 జనవరి, ఫ్రిబవరి, -మార్చి త్రైమాసికం నాటికి అది రూ.4,150కి పెరిగింది. అదే గతేడాది సగటు ధరతో పోలిస్తే.. 10 శాతం పెరుగుదల నమోదైందని, భారతదేశంలోని ప్రధాన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో అహ్మదాబాద్ ఒకటిగా మారిందని ప్రాప్ టైగర్ డాట్ కామ్ బిజినెస్ హెడ్ వికాస్ వాధావన్ పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న అహ్మదాబాద్‌లో కొంత కాలం గా మౌలిక వసతులు పెరిగాయి.
ప్రముఖ హౌసింగ్ మార్కెట్‌గా..
ముంబైతో సహా దేశంలోని పలు ప్రధాన నగరాలకు అంతరాయం లేని రవాణా కనెక్టివిటీ కలిగి ఉన్న నేపథ్యంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి పొరుగు రాష్ట్రాల పెట్టుబడిదారులు కూడా అహ్మదాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, పెట్టుబడులను ఆకర్షించేలా గుజరాత్ ప్రభుత్వం ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండీ విధానాలను అవలంబిస్తున్నదని అందులో తెలిపారు. బలమైన ఆర్థిక వాతావరణంతో పాటు అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలు అహ్మదాబాద్‌ను ప్రముఖ హౌసింగ్ మార్కెట్ గా నిలుపుతున్నాయని ప్రాప్ టైగర్ డాట్ కామ్ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలోనే గతేడాది జనవరి మార్చి కాలంతో పోలిస్తే.. 2024 జనవరి- మార్చి కాలంలో అహ్మదాబాద్‌లో ఇళ్ల విక్రయాలు 78 శాతం వృద్ధితో 12,915 యూనిట్లకు చేరుకున్నట్టు ప్రాప్ టైగర్ తెలిపింది. అయితే కొత్త ఇళ్ల సరఫరా మాత్రం 64 శాతం నమోదుతో 3,116 యూనిట్లకు తగ్గిందని ఆ నివేదికలో తెలిపారు.






